CM Jagan: మంచి చేస్తుంటే మీకెందుకంత బాధ?: తణుకు సభలో సీఎం జగన్
- నేడు సీఎం జగన్ పుట్టినరోజు
- పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన
- నామమాత్రపు రుసుంతో గృహ హక్కు కల్పిస్తున్నామని వెల్లడి
- కొందరు ఓర్వలేకపోతున్నారని విమర్శలు
సీఎం జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామని తెలిపారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా 50 లక్షల మందికి పైగా లబ్ది చేకూర్చే పథకం ప్రారంభించడం ఆనందం కలిగిస్తోందని అన్నారు.
నిరుపేదలు కూడా ఇంటికి యజమాని కావాలన్న సదుద్దేశంతో నామమాత్రపు చెల్లింపుతో వారికి గృహ హక్కు కల్పిస్తున్నామని వివరించారు. దీంతో ఆస్తి విలువ పెరుగుతుందని, వారు ఆ ఇంటిని అమ్ముకునే హక్కు కూడా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఇళ్ల క్రయ విక్రయాలకు లింకు డాక్యుమెంట్లు అవసరంలేదని పేర్కొన్నారు.
"మేం ఇంత మంచి చేస్తుంటే మీకెందుకు కడుపుమంట?" అంటూ విపక్ష నేతలను, కొందరు మీడియా పెద్దలను ఉద్దేశించి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. "రిజిస్ట్రేషన్ లేని పేదల ఇళ్లను మార్కెట్ ధరలకే కొంటారా? అని చంద్రబాబును, రాధాకృష్ణను, రామోజీరావును నిలదీయండి" అంటూ ప్రజలకు సూచించారు. "వీళ్ల ఆస్తులు రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి... పేదల ఆస్తులకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదా?" అని సీఎం జగన్ ప్రశ్నించారు. పేదలకు ప్రయోజనం చేకూరుతుంటే ఓర్వలేని వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు.