North Korea: దక్షిణ కొరియా వీడియోలు చూసినందుకు కిమ్ ఆగ్రహం.. ఏడుగురికి బహిరంగ మరణశిక్ష
- డీజేడబ్ల్యూజీ తాజా నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు
- దక్షిణ కొరియా పాప్ వీడియోలను ‘విషపు క్యాన్సర్’గా పరిగణించే కిమ్
- చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరికైనా ఇలాంటి గతే
- అంతర్జాతీయ పర్యవేక్షణ పెరగడంతో రహస్యంగా మరణశిక్షలు
ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్‌జాంగ్ ఉన్ అకృత్యాల్లో మరోటి వెలుగులోకి వచ్చింది. శత్రుదేశమైన దక్షిణ కొరియాకు చెందిన వీడియోలను చూసినందుకు గాను ఏడుగురికి బహిరంగ మరణశిక్ష విధించారు. ఇందుకు సంబంధించిన తాజా నివేదిక ఒకటి బయటకు వచ్చింది.
‘కిమ్ జాంగ్ ఉన్ పాలనలో హత్యలు: అంతర్జాతీయ ఒత్తిడితో ఉత్తర కొరియా ప్రతిస్పందన’ పేరుతో సియోల్ కేంద్రంగా ఉన్న ట్రాన్షినల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ (టీజేడబ్ల్యూజీ) అనే మానవహక్కుల సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. దక్షిణ కొరియా పాప్ వీడియోలను కిమ్ ‘విషపు క్యాన్సర్’గా భావిస్తారు. ఆ సంస్కృతి దేశంలో అడుగుపెట్టకుండా ఉండేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు.
టీజేడబ్ల్యూజీ తన అధ్యయనంలో భాగంగా ఉత్తర కొరియా నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన 683 మందిని ఇంటర్వ్యూ చేసి కిమ్ హయాంలో ఇప్పటి వరకు 23 హత్యలపై నివేదిక రూపొందించింది. మాదక ద్రవ్యాల సరఫరా, వ్యభిచారం, మానవ అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మరణశిక్షలు విధించినట్టు పేర్కొంది.
కాగా, దక్షిణ కొరియాకు చెందిన పాప్ సినిమా, పాప్ వీడియోలను విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో ఈ ఏడాది మే నెలలో ఓ వ్యక్తికి మరణశిక్ష విధించగా, దక్షిణ కొరియా వినోద కార్యక్రమాలున్న సీడీలు, డ్రైవ్‌లు విక్రయిస్తున్నారన్న నెపంతో 2012-14 మధ్య కాలంలో ర్యాంగాంగ్ ప్రావిన్సులోని హైసన్‌కు చెందిన ఆరుగురికి మరణశిక్ష విధించినట్టు టీజేడబ్ల్యూజీ తన నివేదికలో వెల్లడించింది.
2015లో మరో వ్యక్తికి కూడా మరణశిక్ష అమలు చేసింది. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో మరణశిక్షను అమలు చేస్తూ దానిని వారి కుటుంబ సభ్యులకు చూపిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేసినట్టు కూడా నివేదిక పేర్కొంది. చట్టాలను ఉల్లంఘించిన ఎవరికైనా ఇలాంటి శిక్షలు తప్పవని ప్రజలను హెచ్చరించేందుకే కిమ్ ప్రభుత్వం ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నట్టు నివేదిక పేర్కొంది. దేశంలో యథేచ్ఛగా జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ పర్యవేక్షణ పెరగడంతో మరణశిక్షలను రహస్యంగా చేపడుతున్నట్టు నివేదిక వివరించింది.