Andhra Pradesh: ఏపీలో జరుగుతున్న మతమార్పిడులపై ఫిర్యాదులు అందాయి: కేంద్రం
- ఎఫ్సీఆర్ఏ కింద 18 ఎన్జీవోలు నమోదు
- ఇవన్నీ మతమార్పిడులకు పాల్పడుతున్న ఫిర్యాదులు
- ఎరవేయడం, ప్రేరేపించడం, వక్రీకరణ ద్వారా మతమార్పిడులు
- లోక్సభకు తెలిపిన కేంద్రమంత్రి
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మతమార్పిడులపై తమకు ఫిర్యాదులు అందినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) కింద నమోదైన 18 ఎన్జీవోలు ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడులకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందాయని తెలిపింది. ప్రేరేపించడం, ఎరవేయడం, వక్రీకరణల ద్వారా జనాన్ని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నట్టుగా ఆ ఫిర్యాదుల్లో ఆరోపించినట్టు వివరించింది.
ఈ మేరకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ నిన్న లోక్సభకు తెలిపారు. ఎఫ్సీఆర్ఏ కింద నమోదైన 18 ఎన్జీవోలపైనా మూడేళ్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నట్టు చెప్పారు. ఫిర్యాదుల్లో పేర్కొన్న సంస్థల కార్యకాలాపాల పరిశీలన, ఖాతాల ఆడిటింగ్, తనిఖీ తదితర అంశాలను.. ఎఫ్సీఆర్ఏ నిబంధనల ఉల్లంఘనలపై ఏర్పాటు చేసిన లీగల్ యంత్రాంగం చూసుకుంటుందని సభకు తెలిపారు.