Nadendla Manohar: పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి ఎవరికి న్యాయం చేశారు?: నాదెండ్ల మనోహర్
- వైసీపీ ప్రభుత్వ విధానాలు ఎవ్వరికీ ఉపయోగపడడం లేదు
- డ్వాక్రా మహిళల ఖాతాలు ఖాళీ
- ఎయిడెడ్ కాలేజీల మూసివేత
- ఇసుక, మద్యం ముసుగులో దోపిడీ
ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వ విధానాలు ఎవ్వరికీ ఉపయోగపడడం లేదంటూ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. డ్వాక్రా మహిళల ఖాతాలు ఖాళీ చేశారని ఆయన అన్నారు. అనంతపురం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు.
ఎయిడెడ్ కాలేజీలు మూసివేసి విద్యార్థుల్ని కొడుతున్నారని, రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో ఇసుక, మద్యం ముసుగులో దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఇసుకను పెద్ద పరిశ్రమలా చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి ఏపీ సీఎం జగన్ ఇప్పుడు ఎవరికి న్యాయం చేశారని నాదెండ్ల ప్రశ్నించారు.
151 మంది ఎమ్మెల్యేలతో మూర్ఖత్వ పాలన కొనసాగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్దామని పిలుపునిస్తూ... ఇందుకోసం సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుందామని తెలిపారు. అన్ని కులాలకు రాజ్యాధికారం కల్పించే దిశగా జనసేన కృషి చేస్తుందని అన్నారు.