Nara Lokesh: నా తల్లిని అవమానిస్తారా? నా తండ్రిలా నేను మెతక వైఖరి అవలంబించను: నారా లోకేశ్
- వరద బాధితులను ఆదుకుంటే ఆరోపణలు చేస్తారా?
- ఆరోపణలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతాను
- ఒళ్లు దగ్గరపెట్టుకోండి
- వైసీపీ నేతలు అసలు మనుషులేనా? పశువులా?
- మీ భార్య గురించి, మీ కూతుళ్ల గురించి కూడా ఇలాగే మాట్లాడతారా? అన్న లోకేశ్
ఏపీలోని పలు జిల్లాల్లో వరదల్లో మృతి చెందిన 48 మంది కుటుంబాలకు ఇటీవల ఎన్టీఆర్ ట్రస్టు తరపున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి రూ.లక్ష చొప్పున సాయం అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై పలువురు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు.
ఈ రోజు నారా లోకేశ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'వరద బాధితులను ఆదుకుంటే దీనిపై కూడా ఆరోపణలు చేస్తారా? నా తల్లిని అవమానిస్తారా? మా తండ్రి మాదిరిగా నేను మెతక వైఖరిని అవలంబించను. నా తల్లిపై ఆరోపణలు చేసిన వారికి నేను తగి బుద్ధి చెబుతాను' అని నారా లోకేశ్ హెచ్చరించారు.
'వరద బాధితులను ఆదుకోవడానికి మీరు ఏం చేశారు? మీరా నా తల్లిపై ఆరోపణలు చేసేది? ఒళ్లు దగ్గరపెట్టుకోండి. నేను చెబుతున్నా.. మీరు ఎక్కడ ఉన్నా నేను వదలి పెట్టను.. నా తండ్రి వదిలి పెడతారేమో.. ఆయనది చాలా పెద్ద మనసు. నేను మాత్రం వదలిపెట్టను. నా తల్లిపై ఆరోపణలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు తగి బుద్ధి చెబుతాను' అని నారా లోకేశ్ హెచ్చరించారు.
'వరద మృతుల కుటుంబాలను పరామర్శించి, నా తల్లి రూ.లక్ష చొప్పున సాయం చేశారు. మా అమ్మ కోటి రూపాయలు ఖర్చుపెట్టింది. వరదల సమయంలో వైసీపీ నేతలు విదేశాల్లో ఎంజాయ్ చేశారు. వైసీపీ నేతలు అసలు మనుషులేనా? పశువులా? వరదల సమయంలో పేకాట ఆడుతూ కూర్చున్నారు. మీ తల్లుల గురించి కూడా మీరు ఇలాగే మాట్లాడతారా? మీ భార్య గురించి, మీ కూతుళ్ల గురించి కూడా ఇలాగే మాట్లాడతారా?' అని నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.