Botsa Satyanarayana: అశోక్ వంటి పెద్ద మనిషి ఇలా ప్రవర్తించడం సరికాదు: బొత్స
- రామతీర్థంలో రామాలయ శంకుస్థాపన
- తనను పిలవలేదన్న అశోక్ గజపతిరాజు
- ప్రభుత్వం తరఫున ఫలకాల ఏర్పాటుపై ఆగ్రహం
- అశోక్ రాచరికపు అహంభావాన్ని వీడాలన్న బొత్స
- ఆ రాముడే చూసుకుంటాడని వ్యాఖ్యలు
విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో బోడికొండపై రామాలయ నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా అధికారులకు, టీడీపీ నేత అశోక్ గజపతిరాజుకు మధ్య తోపులాట జరగడం తెలిసిందే. శంకుస్థాపన గురించి ధర్మకర్తనైన తనతో చర్చించలేదని, పైగా, వైసీపీ ప్రభుత్వం తరఫున శంకుస్థాపన ఫలకాలు ఏర్పాటు చేయడం ఏంటని అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫలకాలను తోసివేసే ప్రయత్నం చేశారు. దాంతో అధికారులకు, అశోక్ గజపతిరాజుకు మధ్య ఉద్రిక్తత ఏర్పడింది.
ఈ వ్యవహారంపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అశోక్ వంటి పెద్ద మనిషి ఈ విధంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. శంకుస్థాపనకు ఆహ్వానించడానికి వెళ్లిన ఆలయ ఈవో, ముఖ్య అర్చకులను అశోక్ దూషించారని బొత్స ఆరోపించారు. ఇదేమీ రాచరికపు వ్యవస్థ కాదని స్పష్టం చేశారు. అశోక్ గజపతిరాజు తన రాచరికపు అహంభావాన్ని వీడాలని అన్నారు.
ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయని వ్యక్తి అశోక్ అని విమర్శించారు. తప్పు చేసిన వారిని ఆ రాముడే చూసుకుంటాడని బొత్స వ్యాఖ్యానించారు.