CM Ramesh: ఏపీలో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం త్వరలో చర్యలు!: సీఎం రమేశ్
- త్వరలోనే కేంద్ర సర్కారు నిర్ణయం
- ఇక్కడి పోలీస్ వ్యవస్థను కేంద్ర సర్కారు టెలీస్కోపుతో చూస్తోంది
- పోలీసు అధికారులు నిబంధనల ప్రకారం ఎందుకు వ్యవహరించట్లేదు?
ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేయనుందంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు త్వరలోనే కేంద్ర సర్కారు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక్కడి పోలీస్ వ్యవస్థను కేంద్ర సర్కారు టెలీస్కోపుతో చూస్తోందని ఆయన అన్నారు. ఏపీలో పోలీసు అధికారులు నిబంధనల ప్రకారం ఎందుకు వ్యవహరించడం లేదని ఆయన ప్రశ్నించారు.
రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటాయని, కానీ వ్యవస్థలే ప్రధానమన్న అంశాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఏపీలో పోలీసుల తీరు బాగోలేదని, ఏపీలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కేంద్ర సర్కారు ఏ విధంగా వ్యవహరించిందో గుర్తు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్లోనూ అటువంటి పరిస్థితులే వచ్చాయని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్ర సర్కారు జోక్యం చేసుకుంటుందని ఆయన అన్నారు. ఆ అవకాశం రాజ్యాంగమే ఇచ్చిందని సీఎం రమేశ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిపై తమ పార్టీ ఈ నెల 28న ఓ సభ నిర్వహిస్తుందని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం మారుతుందని, సీఎం జగన్ అర్థం చేసుకుంటారని తాము ఇన్నాళ్లూ వేచి చూశామని, అయితే, ప్రభుత్వంలో మార్పు రాలేదని ఆయన చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఏపీలో రోడ్ల పరిస్థితి బాగోలేదని, ఇసుక కూడా అందుబాటులో లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన చెప్పారు. అలాగే, సిమెంట్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని ఎంపీ సీఎం రమేశ్ విమర్శలు గుప్పించారు. వీటన్నింటిపై తాము పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.