Ashok Gajapathi Raju: నా కుటుంబాన్ని దేశద్రోహుల కుటుంబం అంటున్నారు: అశోక్ గజపతిరాజు
- రామతీర్థం ఘటనలో అశోక్ పై కేసు నమోదు
- హైకోర్టులో పిటిషన్ వేసిన అశోక్
- తమ కుటుంబ పరువు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపాటు
రామతీర్థం ఘటనలో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ పై హైకోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు. తనకు 41ఏ నోటీసును పోలీసులు ఇచ్చారని చెప్పారు.
400 ఏళ్ల చరిత్ర కలిగిన రామతీర్థం ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని ఘటనలు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ పరువు, సంస్కారాలను దెబ్బతీసేలా... తమది దేశద్రోహుల కుటుంబం అని అంటున్నారని మండిపడ్డారు. దీన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
ఆలయానికి సమర్పించే కానుకలకు కూడా మంత్రులు అనుమతులు అడుగుతున్నారని అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. ఆలయాలకు సంబంధించి ఏ విషయం అడిగినా అధికారులు చెప్పడం లేదని అన్నారు. సింహాచలం ఆలయానికి కూడా తాను టోల్ గేట్ కట్టే వెళ్తున్నానని... టోల్ గేట్ కట్టకపోతే తనపై మరో కేసు పెడతారని ఎద్దేవా చేశారు. తనను కేసులతో వేధిస్తున్నారని ఆయన అన్నారు.