Virat Kohli: నిన్న కోహ్లీ ఔటైన తీరుపై షాన్ పొలాక్ ఆసక్తికర వ్యాఖ్యలు
- బాగా ఆడుతోన్న సమయంలో ఔట్
- కోహ్లీకి చిరాకు వచ్చి ఉండవచ్చు
- ఔటయ్యాక హోటల్‌కు వెళ్లిపోయి ఉంటాడు
దక్షిణాఫ్రికా-టీమిండియా మధ్య నిన్న జరిగిన తొలి టెస్టు మ్యాచు తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 35 పరుగులకు ఔటయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సౌతాఫ్రికా మాజీ బౌలర్ షాన్ పొలాక్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్యాటింగ్ సాఫీగా సాగిపోతున్న సమయంలో వికెట్ కోల్పోవడం కోహ్లీకి చిరాకు తెప్పించి ఉండొచ్చని తెలిపారు.
కోహ్లీ ఎలా ఔట్ అయ్యాడో చూడండని ఆయన వ్యాఖ్యానించారు. మంచి టచ్‌లో ఉండి, బాగా ఆడుతోన్న సమయంలో ఆయన ఔట్ అయ్యాడని అన్నారు. క్రీజులో కుదురుకుని భారీ స్కోరు చేస్తాడని అనుకున్న సమయంలో కోహ్లీ 35 పరుగులకే ఔటయ్యాడని చెప్పారు. దీంతో ఆ మ్యాచ్‌ను చూస్తున్నవారు మాత్రమే కాకుండా కోహ్లీ కూడా పూర్తిగా నిరాశకు లోనై ఉంటాడని తెలిపారు. చివరకు ఇలా ఔట్ అయిన తీరును జీర్ణించుకోలేక కోహ్లీ కోపం, విసుగుతో హోటల్‌కు వెళ్లి కూర్చున్నాడేమోనని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ 94 బంతులు ఆడి 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అద్భుతంగా ఆడుతోన్న కేఎల్ రాహుల్‌తో కలిసి కోహ్లీ మంచి భాగస్వామ్యం నమోదు చేస్తున్నాడని అందరూ భావించారు. అయితే, నిర్లక్ష్య ధోరణితో వికెట్ కోల్పోయాడు. ఎంగిడి బౌలింగ్‌లో ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని కోహ్లీ అనవసరంగా టచ్ చేయడంతో ఔట్ అయ్యాడు. కాగా, తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసిన విషయం తెలిసిందే.