R.Narayana Murthy: ఏపీలో సినిమా హాళ్లు మూతపడుతుంటే ఏడుపొస్తోంది: ఆర్.నారాయణమూర్తి

R Narayana Murthy disappoints with cinema theaters closure

  • ఏపీలో సినిమా టికెట్ల ధరలు బాగా తగ్గింపు
  • మూతపడుతున్న సినిమా హాళ్లు
  • సీఎం జగన్ సానుకూలంగా స్పందించాలన్న నారాయణమూర్తి

ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు నేపథ్యంలో అనేక థియేటర్లు స్వచ్ఛందంగా మూతపడుతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై టాలీవుడ్ దర్శకనటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో సినిమా హాళ్లు మూసేస్తుంటే ఏడుపొస్తోందని వ్యాఖ్యానించారు.

సినిమా తీసేవాడు, చూపించేవాడు, చూసేవాడు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. థియేటర్ యజమానులు సినిమా హాళ్లను మూసివేయవద్దని, పరిస్థితుల పట్ల అధైర్యపడవద్దని పిలుపునిచ్చారు. థియేటర్ల అంశంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), నిర్మాతల మండలి జోక్యం చేసుకోవాలని ఆర్.నారాయణమూర్తి స్పష్టం చేశారు.

అటు, ఏపీ ప్రభుత్వానికి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. టికెట్ రేట్ల ప్రభావంతో మూతపడిన అన్ని థియేటర్లు తెరుచుకునేలా సర్కారు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను కోరారు. సినిమా పరిశ్రమపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించాలని అన్నారు. థియేటర్ యాజమాన్యాలు కూడా భావోద్వేగాలకు గురికాకుండా, వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. సమస్యలను ముందు మంత్రులకు నివేదించి, వారి సాయంతో సీఎం జగన్ కు తెలియజేయాలని నారాయణమూర్తి పేర్కొన్నారు. నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' సక్సెస్ మీట్ లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News