Cricket: ధోనీలా ప్రశాంతంగా ఉంటే కోహ్లీ ఇన్ని పరుగులు చేసేవాడే కాదు: భజ్జీ
- అతడి దూకుడే జట్టును ఈ స్థితిలో నిలిపింది
- అలాంటి వాళ్లే ఇప్పుడు భారత్ కు కావాలి
- జట్టులో కోహ్లీ ఎంతో మార్పు తెచ్చాడు
- గెలుపా? ఓటమా? అన్న వైఖరితోనే విజయాలు
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ దూకుడు, ఆవేశమే అతడికి బలాలని చెప్పుకొచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీలాగా ప్రశాంతంగా ఉండి ఉంటే కోహ్లీ ఇన్ని పరుగులు చేసేవాడా? అని అన్నాడు. నాయకుడిగా భారత జట్టును కోహ్లీ ఎంతగానో తీర్చిదిద్దాడన్నాడు. అతడి దూకుడు జట్టుకు బాగా నప్పిందన్నాడు. మన జట్టుకు కోహ్లీ లాంటి దూకుడు కలిగిన ఆటగాళ్లు మరింత మంది కావాలన్నాడు.
జట్టు ఆస్ట్రేలియా గడ్డమీద అడుగుపెట్టినప్పుడు.. అక్కడ మ్యాచ్ ను ఎలా కాపాడుకోవాలనే అప్పట్లో ఆలోచించేవారని, కానీ, కోహ్లీ కెప్టెన్ అయ్యాక ఆ ఆలోచనా ధోరణి మారిందని చెప్పాడు. టెస్ట్ సిరీస్ ను ఎలా గెలవాలన్న దానిపైనే జట్టు ఆలోచిస్తోందని పేర్కొన్నాడు. 2014 అడిలైడ్ టెస్టులో కోహ్లీ 141 పరుగుల ఇన్నింగ్స్ సందర్భంగా కోహ్లీతో మాట్లాడిన మాటలను భజ్జీ గుర్తు చేసుకున్నాడు.
‘‘నాకు బాగా గుర్తు. 2014 టెస్ట్ సిరీస్ లో కోహ్లీ పరుగుల వరద పారించాడు. ఆ సిరీస్ ఓడిపోయామనుకోండి. అయితే, అడిలైడ్ టెస్ట్ లో 400 పరుగుల ఛేదనలో భాగంగా కోహ్లీ 141 పరుగులు చేశాడు. ఔటై పెవిలియన్ కు వచ్చాక.. కోహ్లీతో నేను మాట్లాడాను. అంత దూకుడుగా ఆడకుండా ఉండి ఉంటే కనీసం మ్యాచ్ ను డ్రా చేసుకునే వాళ్లం కదా? అని అన్నాను. దానికి అతడిచ్చిన సమాధానం ఆలోచింపజేసింది. తన దృష్టిలో డ్రా అయ్యే మ్యాచ్ లకు విలువలేదని కోహ్లీ చెప్పాడు. గెలవడమా? ఓడడమా? పోరాడడం నేర్చుకుంటే ఏదో ఒక రోజు కచ్చితంగా గెలుస్తాం’’ అని భజ్జీ గుర్తు చేసుకున్నాడు.
ఇప్పుడు భారత జట్టులో కనిపించిన అతిపెద్ద మార్పు అదేనన్నాడు. ఆ మార్పుతోనే ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే కోహ్లీ నేతృత్వంలో రెండు సార్లు ఓడించారన్నాడు. ఇంగ్లండ్ లోనూ అదే రిపీట్ అయిందన్నాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనలోనూ అదే రిపీట్ అవుతుందని ఆశిస్తున్నానన్నాడు.