Wasim Jaffer: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ కు అదనుచూసి కౌంటర్ ఇచ్చిన వసీం జాఫర్
- 2019లో హామిల్డన్ వన్డేలో భారత్ 92 ఆలౌట్
- నాడు వ్యంగ్యం ప్రదర్శించిన మైఖేల్ వాన్
- ఈ రోజుల్లో కూడా ఇలా ఆడతారా? అంటూ విపరీతాశ్చర్యం
- నేడు ఇంగ్లండ్ 68 ఆలౌట్
- ఎత్తిపొడిచిన వసీం జాఫర్
గతంలో న్యూజిలాండ్ తో జరిగిన ఓ వన్డే మ్యాచ్ లో టీమిండియా 92 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ విపరీతమైన ఆశ్చర్యం ప్రదర్శించాడు. సహజంగానే భారత్ పై విమర్శనాత్మకంగా స్పందించే అతడు... హామిల్టన్ టీమిండియా ప్రదర్శనపై స్పందిస్తూ... "భారత్ 92 పరుగులకే కుప్పకూలింది. ఈ రోజుల్లో కూడా ఏ జట్టయినా 100 లోపే ఆలౌట్ అవుతుందంటే నమ్మలేకపోతున్నాను" అంటూ విడ్డూరంగా వ్యాఖ్యానించాడు.
అయితే, ఆనాడు వాన్ చేసిన వ్యాఖ్యలను భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాత్రం మర్చిపోలేదు. సమయం కోసం కాచుకుని ఉన్నాడు. ఇవాళ మెల్బోర్న్ లో జరిగిన యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ మరీ దారుణంగా 68 పరుగులకే చేతులెత్తేసింది.
ఇంకేముంది... "ఇంగ్లండ్ 68 ఆలౌట్" అంటూ మైఖేల్ వాన్ ను ఉద్దేశించి వసీం జాఫర్ ఓ ట్వీట్ చేశాడు. అందులో వాన్ గతంలో టీమిండియాను ఉద్దేశించి చేసిన ట్వీట్ ను కూడా జాఫర్ పొందుపరిచాడు. ఆ విధంగా అదనుచూసి కౌంటర్ ఇచ్చాడు. అందుకు మైఖేల్ వాన్ మింగలేక కక్కలేక అన్నట్టు "వెరీ గుడ్ వసీం" అంటూ ఎమోజీలతో బదులిచ్చాడు.