Cricket: దక్షిణాఫ్రికాతో వన్డేలకు కెప్టెన్ గా రాహుల్!
- తొడ కండరాల గాయానికి చికిత్స తీసుకుంటున్న రోహిత్
- కోలుకోవడానికి మరో 6 వారాలు పడుతుందంటున్న నిపుణులు
- అదే జరిగితే వన్డేలకూ హిట్ మ్యాన్ దూరం
తొడ కండరాల గాయంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు దూరమైన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. వన్డేలకు అనుమానమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటూ పూర్తి ఫిట్ నెస్ సాధించేందుకు సాధన చేస్తున్నాడు. వన్డేలు మొదలయ్యే సమయానికి అతడు కోలుకునే అవకాశాలు లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. రోహిత్ కోలుకోవడానికి మరో 4 నుంచి 6 వారాలు పట్టే అవకాశం ఉందని అంటున్నారు.
అదే జరిగితే.. జనవరి 19 నుంచి మొదలయ్యే వన్డేలకూ రోహిత్ దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో జట్టు పగ్గాలను కేఎల్ రాహుల్ కు అందిస్తారన్న చర్చ నడుస్తోంది. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ కు అప్పగించిన సంగతి తెలిసిందే. అదికాస్తా రసాభాసగా మారిపోయింది. కాగా, ప్రస్తుతం సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ చెలరేగి ఆడుతున్నాడు. 260 బంతులాడి 123 పరుగులు చేసి జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు.