Cricket: కోహ్లీ మనసులో వేరే ఆలోచన ఉండి ఉండొచ్చు.. ఔటైన తీరుపై సునీల్ గవాస్కర్ అసహనం
- దూరంగా పడిన బంతిని వేటాడడమా?
- నిలదొక్కుకునేదాకా ఆగి ఉండాల్సింది
- బహుశా వేగంగా ఆడి డిక్లేర్ చేద్దామనుకున్నాడేమోనని కామెంట్
సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ కోహ్లీ వైఫల్యం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ కొనసాగింది. తొలి ఇన్నింగ్స్ లో అవుటైన తీరులోనే సెకండ్ ఇన్నింగ్స్ లోనూ కోహ్లీ అవుటయ్యాడు. రెండు సందర్భాల్లోనూ ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని వేటాడి కీపర్ చేతికి చిక్కాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 35, సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 18 పరుగులే చేశాడు. దీంతో అతడిపై విమర్శకులు బాణాలు ఎక్కుపెట్టారు. ఇటు సునీల్ గవాస్కర్ కూడా కోహ్లీ ఔటైన తీరుపై స్పందించారు. ఆ సమయంలో కామెంటరీ బాక్స్ లో ఉన్న గవాస్కర్.. కోహ్లీ ఔటైన విధానంపై అసహనం వ్యక్తం చేశారు.
‘‘బంతిని ఆఫ్ సైడ్ ఆవల వేశారు. దానిని కోహ్లీ ఎంత దూరం వేటాడాడో చూడండి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో లాగే అవుటయ్యాడు. లంచ్ తర్వాత తొలి బంతినే అంత లూజ్ షాట్ ఆడడం విడ్డూరం. టెస్ట్ క్రికెట్ లో ప్రతి బ్యాట్స్ మన్ ముందుగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాలి. డ్రింక్స్ బ్రేక్ అయినా సరే.. బ్రేక్ తీసుకున్నాక కాస్త నిలకడగా ఆడాలి. ఎంతో అనుభవమున్న ఆటగాడిగా కోహ్లీ అలాంటి షాట్ ఆడడం మంచిది కాదు. కోహ్లీ మనసులో ఇంకేదైనా ఆలోచన ఉండి ఉండవచ్చు. వేగంగా ఆడి.. స్కోరు బోర్డుపై పరుగులు యాడ్ చేసి డిక్లేర్ చేద్దామనుకుని ఉండొచ్చు’’ అని గవాస్కర్ వ్యాఖ్యానించారు.