Bharat Biotech: పిల్లలపై బ్రహ్మాండంగా పనిచేస్తున్న కొవాగ్జిన్ టీకా.. క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుతమైన ఫలితాలు
- జూన్-సెప్టెంబరు మధ్య 525 మంది వలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్
- న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు 1.7 రెట్లు అధికం
- సైడ్ ఎఫెక్ట్లు నిల్
- తమ కల నెరవేరిందన్న డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా చిన్నారులపై బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. పిల్లలపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చినట్టు పేర్కొంది. 12-18 ఏళ్ల లోపు పిల్లలకు ఇచ్చేందుకు ఇటీవలే ఈ టీకాకు డీసీజీఐ నుంచి అత్యవసర అనుమతి లభించింది.
ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు మధ్య మొత్తం 525 మంది వలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. అంతకంటే ముందు వీరిని వయసుల వారీగా మూడు బృందాలుగా విభజించారు. ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు కనబరిచినట్టు భారత్ బయోటెక్ తెలిపింది. పెద్దల కంటే పిల్లల్లోనే న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు 1.7 రెట్లు అధికంగా కనిపించినట్టు పేర్కొంది.
అలాగే, సైడ్ ఎఫెక్టులు కూడా కనిపించలేదని వివరించింది. మయోకార్డిటీస్, రక్తం గడ్డకట్టడం వంటివి ఎక్కడా కనిపించలేదని స్పష్టం చేసింది. ఈ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్టు తెలిపింది. చిన్నారులకు, పెద్దలకు అనువైన, అత్యంత సురక్షితమైన కరోనా టీకాను ఆవిష్కరించాలన్న తమ కల నెరవేరిందని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు.