Centurion: 11 నెలల క్రితం గబ్బాలో ఆసీస్‌ను ఓడించి.. ఇప్పుడు సెంచూరియన్ కోటను బద్దలుగొట్టిన టీమిండియా!
- ఇండియా విజయంతో సఫారీల సెంచూరియన్ కోట బద్దలు
- సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో విజయాన్ని అందించిన తొలి ఇండియన్ కెప్టెన్‌గా కోహ్లీ
- ఇక్కడ విజయం సాధించిన మూడో పర్యాటక జట్టుగా టీమిండియా
మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. ఇప్పటి వరకు సెంచూరియన్‌లో అందని ద్రాక్షగా ఉన్న విజయాన్ని అందుకున్న భారత్ అనేక రికార్డులను తిరగరాసింది. 11 నెలల క్రితం ప్రతిష్ఠాత్మక గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాను ఓడించి విదేశాల్లో అరుదైన ఘనత సాధించిన కోహ్లీ సేన ఈ విజయంతో సఫారీల సెంచూరియన్ కోటను బద్దలుగొట్టింది.
సౌతాఫ్రికాలో భారత జట్టు ఇప్పటి వరకు 22 టెస్టులు ఆడగా గెలిచింది మాత్రం నాలుగింటిలోనే. 2006-07 పర్యటనలో రాహుల్ ద్రావిడ్ సారథ్యంలోని భారత జట్టు సఫారీ గడ్డపై మూడు టెస్టులు ఆడింది. తొలి టెస్టును గెలిచి 1-0తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత ఇప్పుడు కోహ్లీ జట్టు తొలి టెస్టు గెలిచి ఆతిథ్య జట్టుపై ఆధిక్యం సాధించింది.
అయితే, నాటి సిరీస్‌లో ద్రావిడ్ సేన ఆ తర్వాతి రెండు టెస్టుల్లోనూ ఓడి సిరీస్ కోల్పోయింది. తాజా విజయంతో సెంచూరియన్‌లో విజయం సాధించిన తొలి ఇండియన్ కెప్టెన్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. 2018లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన ధోనీ సారథ్యంలోని భారత జట్టు సెంచూరియన్ టెస్టులో పరాజయం పాలైంది. ఆ సిరీస్ డ్రా అయింది.
సెంచూరియన్‌లో విజయం సాధించిన మూడో పర్యాటక జట్టుగా టీమిండియా ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. అంతకుముందు ఇంగ్లండ్ 2000వ సంవత్సరంలో, ఆస్ట్రేలియా 2014లో సెంచూరియన్ టెస్టులో విజయం సాధించాయి. ఇక, ఇక్కడ ఇప్పటి వరకు 28 టెస్టులు ఆడిన సఫారీలు 21 టెస్టుల్లో విజయం సాధించారు. మూడింటిలో మాత్రమే ఓడారు. ఆ మూడో పరాజయం తాజాగా భారత్ చేతిలోనే.