Vinod Kambli: కోహ్లీపై ప్రశంసలు కురిపించిన వినోద్ కాంబ్లీ
- సెంచూరియన్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా
- ప్రపంచంలో అత్యుత్తమ కెప్టెన్ కోహ్లీ అన్న కాంబ్లీ
- ఈ సిరీస్ లో మళ్లీ పాత కోహ్లీని చూస్తామని వ్యాఖ్య
సెంచూరియన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సేన 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వన్డే కెప్టెన్ గా తొలగించిన తర్వాత టెస్ట్ కెప్టెన్ గా కోహ్లీకి ఇది తొలి విజయం. మరోవైపు సెంచూరియన్ విజయం తర్వాత కోహ్లీపై టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ కోహ్లీ అని కాంబ్లీ కితాబునిచ్చాడు.
కెప్టెన్సీ మార్పుపై పెద్ద చర్చ నడుస్తోందని... ఇలాంటి సమయంలో దక్షిణాఫ్రికా గడ్డపై మనం అద్భుతం సృష్టించామని కాంబ్లీ అన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ గా కోహ్లీ నిరూపించుకున్నాడని చెప్పాడు. కోహ్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే... ఈ సిరీస్ లో అతను కచ్చితంగా ఫామ్ లోకి వస్తాడని, మళ్లీ మనం పాత కోహ్లీని చూస్తామని తెలిపాడు.
మరోవైపు, టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా సాధించకుండానే వరుసగా రెండో సంవత్సరాన్ని కోహ్లీ ముగించాడు. సెంచూరియన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 35, రెండో ఇన్నింగ్స్ లో 18 పరుగులను కోహ్లీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో అద్భుతమైన సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. తొలి మ్యాచ్ విజయంతో ఈ సిరీస్ లో ఇండియా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. రెండో టెస్ట్ జొహానెస్ బర్గ్, మూడో టెస్ట్ కేప్ టౌన్ లో జరగనున్నాయి.