Revanth Reddy: నీ ప్రగతి భవన్లు, ఫామ్ హౌస్ లు బద్దలైపోతాయ్: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్
- ప్రతిపక్ష నేతల ఇళ్లలోకి పోలీసులను ఉసిగొల్పుతున్నావ్
- తెలంగాణ నీ ప్రైవేట్ రాజ్యమనుకుంటున్నావా?
- రైతుల చావుకేకలు నీకు వినిపించడం లేదా?
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఈరోజు పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భూపాలపల్లి నియోజకవర్గంలో రచ్చబండకు వెళ్లకుండా పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన నిప్పులు చెరిగారు. పౌర స్వేచ్ఛను కేసీఆర్ అణచివేస్తున్నాడని... ప్రతిపక్ష నేతల ఇళ్లలోకి పోలీసులను ఉసిగొల్పుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కేసీఆర్ కు వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. తాము ఇంట్లో నుంచి కాలు బయటపెడితే కేసీఆర్ వణికిపోతున్నాడని చెప్పారు.
అర్థరాత్రి పోలీసులతో ఇంటిని ముట్టడింపజేయడం, తాము పరామర్శలకు వెళ్లకుండా చేయడం, ఇదేనా నీ సంస్కారం కేసీఆర్? అని రేవంత్ ప్రశ్నించారు. అనుమతి లేకుండా పోలీసులు ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తారని మండిపడ్డారు. ప్రజాగ్రహం వెల్లువెత్తిన రోజు నీ ప్రగతిభవన్లు, నీ ఫామ్ హౌసులు బద్దలవుతాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భారత రాజ్యాంగంలో ఒక భాగం అనుకుంటున్నావా? లేదా నీ ప్రైవేట్ రాజ్యమనుకుంటున్నావా? అని నిలదీశారు.
రైతులు చచ్చిపోతుంటే వారిని పరామర్శించడం కూడా తప్పా? అని రేవంత్ అన్నారు. నీవు ఎలాగూ రైతులను పరామర్శించడం లేదని... ఆ పని తాము చేస్తుంటే నీకొచ్చిన నొప్పి ఏందని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లలో శుభకార్యాలకు వెళ్లి గంటల సమయం గడిపే నీకు... రైతుల చావుకేకలు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు.