RRR: దేశంలో కరోనా విజృంభణ ఎఫెక్ట్.. 'ఆర్ఆర్ఆర్' సినిమా వాయిదా?
- నిర్ణయం తీసుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్
- త్వరలోనే అధికారిక ప్రకటన
- కరోనా ఆంక్షల వేళ నిర్ణయం
ఈ నెల 7న విడుదల కావలసిన 'ఆర్ఆర్ఆర్' సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై ఈ రోజు సాయంత్రంలోగా ఆ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఒమిక్రాన్ విజృంభణతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి.
మరికొన్ని రోజుల్లో కరోనా వ్యాప్తి మరింత పెరిగే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లు మూత పడడం లేదా వాటిల్లోనూ ఆంక్షలు విధించడం వంటివి జరిగితే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమాను వాయిదా వేయాలని ఆ యూనిట్ నిర్ణయించినట్లు తెలిసింది.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే, ఇప్పటికే ఢిల్లీలో థియేటర్లు మూతపడడం, మహారాష్ట్ర రాజధాని ముంబయిలో 50 శాతం సామర్థ్యంతోనే నడుస్తుండడంతో ఆర్ఆర్ఆర్ వాయిదా వేయక తప్పదని ఆ సినిమా యూనిట్ భావిస్తోంది.
ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన పలు తెలుగు సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. సంక్రాంతి నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా వాయిదా పడుతుందన్న ప్రచారం నేపథ్యంలో సినీ అభిమానులు నిరాశలో ఉన్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సి ఉండగా ఇప్పటికే ఓ సారి వాయిదా పడిన విషయం తెలిసిందే.