Maharashtra: మహారాష్ట్రలో 10 మంది మంత్రులకు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధారణ
- ప్రకటన చేసిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్
- అసెంబ్లీ సమావేశాల్లో సోకిందని వివరణ
- నిన్న మహారాష్ట్రలో ఒక్కరోజులో 8,067 కేసులు
- మూడో దశ వ్యాప్తి ప్రారంభమైందనే సూచనలు
మహారాష్ట్రలో 10 మంది మంత్రులకు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధారణ కావడం కలవరపెడుతోంది. ఇటీవలే ఆ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సమయంలోనే కరోనా విజృంభించింది. ఈ సమావేశాలకు హాజరైన వారికి కరోనా సోకినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ రోజు ఓ ప్రకటన చేశారు.
రాష్ట్రంలో కఠిన ఆంక్షలు తప్పేలా లేవని చెప్పారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు విధించారని గుర్తు చేశారు. తమ రాష్ట్రంలోని ముంబై, పూణెలో కేసులు అత్యధికంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోందన్నారు.
మహారాష్ట్రలో రాజధాని ముంబైతో పాటు ఇతర జిల్లాల్లోనూ కరోనా మళ్లీ విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 8,067 కొత్త కేసులు నమోదయ్యాయి. మొన్న ఆ రాష్ట్రంలో నమోదైన కేసుల కన్నా నిన్న 50 శాతం అధికంగా కేసులు నమోదు కావడం గమనార్హం. వాటిల్లో ఒక్క ముంబైలోనే నిన్న 5,631 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ నగరంలో మొత్తం కరోనా కేసులు 7,85,110కి చేరాయి.
మరోపక్క, దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ శరవేగంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. దేశంలో మూడో దశ కరోనా విజృంభణ సూచనలు కనపడుతున్నాయని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. కాగా, కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని భారత వైరాలజిస్ట్ డా.గగన్‌దీప్ కాంగ్ ఈ రోజు మీడియాకు చెప్పారు. ప్రస్తుతం విజృంభిస్తోన్న ఒమిక్రాన్ ప్రభావం ఆరోగ్యంపై ఇతర వేరియంట్ల కంటే ప్రభావం తక్కువగానే ఉంటుందని చెప్పారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో మరోసారి కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.