india: మారని చైనా బుద్ధి.. తూర్పు లడఖ్ లో మళ్లీ రాజుకుంటున్న వేడి.. అదనపు దళాల మోహరింపు

India has enhanced force levels in areas where no troop disengagement in eastern Ladakh

  • కొన్ని సరిహద్దు ప్రాంతాల నుంచి వైదొలగని చైనా దళాలు
  • అరుణాచల్ ప్రదేశ్ లోని గ్రామాలకు సొంత పేర్లు
  • తీవ్రంగా ఖండించిన భారత్
  • యుద్ధట్యాంకులు, మిసైళ్లతో అదనపు దళాల తరలింపు

చైనా సరిహద్దుల్లో మళ్లీ యుద్ధవాతావరణం కమ్ముకుంటోంది. తూర్పు లడఖ్ లోని భారత్ సరిహద్దుల నుంచి తన దళాలను పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు చైనా లోగడ అంగీకరించినా, ఆ పని చేయలేదు. దీంతో చైనా దళాలు మోహరించి ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో భారత్ అదనపు దళాలను మోహరిస్తోంది.  

భారత సైన్యం.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)తో కఠినంగానే వ్యవహరిస్తుందని.. దేశ సమగ్రత, రక్షణ విషయంలో రాజీపడేది లేదని రక్షణ శాఖ ప్రకటించింది. వాస్తవానికి ఇరు దేశాల మధ్య 14వ విడత చర్చలు జనవరిలో జరగాల్సి ఉంది. ఈలోపే ఈ పరిణామం చోటు చేసుకుంది. 13 విడతలుగా చర్చలు నడిచినా, హాట్ స్ప్రింగ్స్-గోగ్రా-కొంగ్ కా లా ప్రాంతంలోని 15వ పెట్రోలింగ్ పాయింట్ నుంచి చైనా తన దళాలను వెనక్కి తీసుకోవడం లేదు.

శీతాకాలం కావడంతో చైనా ఏదైనా దుస్సాహసానికి ఒడిగడితే గట్టిగా బదులివ్వాలని సైనిక దళాలు సంక్పలంతో ఉన్నాయి. 50,000 దళాలను, యుద్ధ ట్యాంకులు, హోవిట్జర్లు, మిసైళ్లతో భారత సైన్యం అక్కడ మోహరించింది. మరోవైపు భారత్ తో వాస్తవాధీన రేఖ 4,388 కిలోమీటర్ల పొడవునా అరుణాచల్ ప్రదేశ్ నుంచి తూర్పు లడఖ్ వరకు చైనా దళాలను పెంచుకుంటోంది. దీంతో భారత్ కూడా అప్రమత్తం అయింది.

రెండు రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు గ్రామాలు కొన్నింటికి చైనా తన పేర్లను పెట్టుకోవడం తెలిసిందే.  దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేస్తూ చైనా చర్యను తప్పుబట్టింది. ఈ క్రమంలో చైనా ఏవైనా దుందుడుకు చర్యలకు దిగితే మరోసారి పాఠం చెప్పేందుకు వీలుగా అదనపు దళాలను మోహరించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News