Odisha: నూతన సంవత్సర విందు కోసం మేకలను దొంగిలించిన పోలీసులు
- ఒడిశాలోని బొలంగీర్ జిల్లాలో ఘటన
- మేకలను కోసేందుకు సిద్ధపడిన పోలీసులను అడ్డుకున్న బాధితుడు
- బెదిరించి పంపేసిన వైనం
- విచారణ జరిపించి ఏఎస్ఐని సస్పెండ్ చేసిన ఎస్పీ
పోలీసులు మేకలను దొంగిలించారు.. అవును, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విందులో నాన్‌వెజ్ వడ్డించేందుకు మేకలను చోరీ చేశారు. ఒడిశాలోని బొలంగీర్ జిల్లా సింధికెల గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన సంకీర్తనగురు మేకలు పెంచుకుంటున్నాడు. అతడి మందలో రెండు మేకలు శుక్రవారం మాయమయ్యాయి. ఆరా తీస్తే వాటిని పోలీసులే దొంగిలించారని తెలిసింది. దీంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు.
అప్పటికే వాటిని కోసేందుకు పోలీసులు సిద్ధం కాగా చూసి అడ్డుకున్నాడు. తన మేకలు తనకు ఇవ్వమని అడిగాడు. వారు వినిపించుకోలేదు సరికదా, సంకీర్తనగురును బెదిరించి పంపేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆయన విషయాన్ని గ్రామస్థులకు చెప్పాడు. ఈసారి అందరూ కలిసొచ్చి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా, మరోమారు బెదిరించారు. ఈ విషయం చర్చనీయాంశం కావడంతో ఎస్పీ నితిన్ శుక్లాకర్ దృష్టికి వెళ్లింది. విచారణ జరిపించిన ఎస్పీ.. ఏఎస్ఐ సుమన్ మల్లిక్‌ను నిన్న విధుల నుంచి సస్పెండ్ చేశారు.