South Central Railway: పండుగ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. అందుబాటులోకి మరో 10 రైళ్లు!
- సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్
- కాచిగూడ, లింగంపల్లి నుంచి రైళ్లు
- కొన్ని కాజీపేట, మరికొన్ని నల్గొండ మీదుగా ప్రయాణం
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరో పది ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే.. ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో అదనంగా వీటిని ప్రకటించింది. కాచిగూడ-విశాఖపట్టణం-కాచిగూడ, కాచిగూడ-నర్సాపూర్-కాచిగూడ, కాకినాడ టౌన్-లింగంపల్లి-కాకినాడ టౌన్ స్టేషన్ల మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి.
కాచిగూడ-విశాఖపట్టణం మధ్య 7, 14న, విశాఖపట్టణం-కాచిగూడ మధ్య 8, 16న కాచిగూడ-నర్సాపూర్ మధ్య 11న, నర్సాపూర్-కాచిగూడ మధ్య 12న, కాకినాడ టౌన్-లింగంపల్లి రైలు 19, 21న, లింగంపల్లి-కాకినాడ మధ్య 20, 22 తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ నుంచి విశాఖపట్టణం వెళ్లే రైళ్లు కాజీపేట మీదుగా, కాచిగూడ నుంచి నర్సాపూర్ రైళ్లు నల్గొండ మీదుగా, కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వెళ్లే రైళ్లు సామర్లకోట మీదుగా నడుస్తాయని వివరించింది.