East Godavari District: గోదావరిలోకి దూకి వలంటీర్ ఆత్మహత్యాయత్నం.. కాపాడబోయి కౌన్సిలర్ మృతి
- తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
- భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులిచ్చిన వలంటీరు
- వలంటీరును రక్షించేందుకు నదిలోకి దిగి మునిగిపోయిన కౌన్సిలర్
- ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వలంటీరు
గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన వలంటీరును కాపాడబోయిన కౌన్సిలర్ ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం ముమ్మిడివరం నగర పంచాయతీలోని బొండాయికోడు సచివాలయంలో పనిచేస్తున్న పెదపూడి లక్ష్మీకుమారి 13వ వార్డు వలంటీరుగా పనిచేస్తున్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఈ విషయంలో శుక్రవారం కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన లక్షీకుమారి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
నిన్న మధ్యాహ్నం అన్నంపల్లి అక్విడెక్టు వద్దకు వచ్చి గౌతమి గోదావరి నదీపాయలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు సమయం కోసం అక్కడ తచ్చాడారు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న లంకాఫ్ ఠాణేలంకలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రెడ్డి రమణ ఆమెను చూసి అనుమానించి 12వ వార్డు కౌన్సిలర్ భీమవరపు విజయదుర్గారావు (35)కు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆయన అప్పటికే నదిలో దూకిన లక్ష్మిని రక్షించేందుకు నదిలోకి దిగారు.
అయితే, నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మునిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానిక మత్స్యకారులు నదిలోకి దిగి ఇద్దరినీ ఒడ్డుకు చేర్చారు. అయితే, దుర్గారావు అప్పటికే మృతి చెందడంతో విషాదం అలముకుంది. ప్రాణాలతో బయటపడిన లక్ష్మిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.