Corona Virus: తెలంగాణ వ్యాప్తంగా క‌రోనా ఆంక్షలు అమ‌లు

corona restrictions in ts

  • నేటి నుంచి ఈ నెల 10 వ‌ర‌కు పొడిగింపు
  • సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ
  • మాస్కు ధ‌రించకుంటే రూ.1,000 జ‌రిమానా
  • క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని ఆదేశాలు

తెలంగాణ వ్యాప్తంగా క‌రోనా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు, సామూహిక కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు తెలంగాణ‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్ష‌లు ఈ నెల‌ 10 వరకు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై రూ.1000 జరిమానా విధిస్తారు.

ఈ మేర‌కు నిబంధ‌న‌ల‌ను కచ్చితంగా అమలు చేయాలని అధికారుల‌ను సోమేశ్ కుమార్ ఆదేశించారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో, ప్రజా రవాణా వ్యవస్థలతో పాటు దుకాణాలు, కార్యాలయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాల‌ని, భౌతిక దూరాన్ని పాటించాల‌ని, అలాగే, ఐఆర్‌ థర్మామీటర్, శానిటైజర్‌ సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉంచాల‌ని చెప్పారు.

క‌రోనా కేసులు పెరిగిపోతోన్న నేప‌థ్యంలో ఈ ఆంక్ష‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం పొడిగించింది. ఈ నెల‌ 2 వరకు రాష్ట్రంలో ఆంక్షలు విధిస్తున్న‌ట్లు కొన్ని రోజుల క్రితం తెలంగాణ సర్కారు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండ‌డం వంటి ముప్పుతో ఈ నెల 10 వరకు వాటిని పొడిగించింది.

అనేక రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయని సోమేశ్ కుమార్ అధికారుల‌కు చెప్పారు. తెలంగాణ‌లో ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని ఆయ‌న అన్నారు. తెలంగాణ‌లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కు చేరింది. వారిలో 27 మంది కోలుకున్నారు. మూడో ద‌శ క‌రోనా వ్యాప్తి వ‌చ్చే ముప్పు ఉంద‌ని ఇటీవ‌లే తెలంగాణ‌ ప్ర‌జారోగ్య శాఖ డైరెక్ట‌ర్ గ‌డ‌ల శ్రీ‌నివాస‌రావు హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News