Golla Baburao: పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు వ్యతిరేకంగా జాతీయ రహదారిపై నిరసన, మానవహారం

Protest against Payakaraopeta MLA Golla Baburao

  • ఎమ్మెల్యే వసూలు రాజాలా మారారు
  • ఆయన వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఓటమి
  • ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి లక్షల్లో వసూలు
  • 68 బియ్యం పంపిణీ వాహనాల నుంచి రూ. 50 వేల చొప్పున వసూలు
  • తీవ్ర ఆరోపణలు చేసిన ఎంపీపీ బొలిశెట్టి శారద

విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వసూల్ రాజాలా మారారని ఆరోపిస్తూ ఆయన వ్యతిరేక వర్గం నేతలు ఎంపీపీ బొలిశెట్టి శారదా కుమారి దంపతులు, మద్దతుదారులు పెదగుమ్ములూరు నుంచి వెయ్యిమందితో నిన్న నిరసన ర్యాలీ చేపట్టారు. వీరు జాతీయ రహదారిపైకి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఈ క్రమంలో కొందరు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి సర్దిచెప్పడంతో అక్కడి నుంచి పాత జాతీయ రహదారి కూడలి వద్దకు చేరుకుని మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా జగన్ ముద్దు.. ఎమ్మెల్యే వద్దు అని నినాదాలు చేశారు.

అంతకుముందు శారద, ఆమె భర్త గోవిందరావు రాయవరం మండలం అడ్డురోడ్డులో విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే బాబూరావు ప్రజల కష్టసుఖాలను గాలికొదిలేశారని, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసే 68 వాహనాల నుంచి రూ. 50 వేల చొప్పున వసూలు చేశారని అన్నారు.

సచివాలయాల నుంచి రైతు భరోసా కేంద్రాల వరకు ఏ ఒక్కదానినీ వదిలిపెట్టకుండా అన్నింటి నుంచి వసూళ్లు చేసిన ఘనత ఒక్క ఎమ్మెల్యేకే దక్కుతుందన్నారు. లింగరాజుపాలెం రెసిడెన్షియల్ పాఠశాలలో రెండు ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి రూ. 2 లక్షల చొప్పున వసూలు చేశారని ఆరోపించారు. తిరుమల వెంకన్న దర్శనానికి ఇచ్చే లేఖలకు కూడా విలువ కట్టి విక్రయించారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓటమికి కూడా ఆయనే కారణమని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News