Hyderabad: ఒక్క రోజు కూడా కాకుండానే నుమాయిష్ మూత.. అప్పటికప్పుడు పదివేల మంది బయటకు!
- కరోనా కేసులు పెరుగుతుండడంతో అధికారుల నుంచి ఆదేశాలు
- సందర్శకులు బయటకు వెళ్లిపోవాల్సిందిగా మైకుల ద్వారా ప్రకటన
- ఉసూరుమంటూ వెనుదిరిగిన వేలాదిమంది
నూతన సంవత్సరం రోజున హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభమైన అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ నుమాయిష్ ఒక్క రోజు కూడా కాకుండానే మూతపడింది. ఈ నెల 1న హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుమాయిషన్‌ను ప్రారంభించారు. అయితే, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత రాత్రి అకస్మాత్తుగా నుమాయిష్‌ను మూసివేశారు. దీంతో అప్పటికే ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న దాదాపు పదివేల మంది దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
పోలీసు అధికారుల నుంచి అందిన ఆదేశాలతో తొలుత టికెట్ బుకింగ్ కౌంటర్లను మూసేశారు. ఆ తర్వాత యజమానులు స్టాళ్లను మూసివేశారు. లోపల ఉన్న సందర్శకులు వెళ్లిపోవాల్సిందిగా మైకుల ద్వారా ప్రకటించారు. నుమాయిష్ సందర్శనకు ఆనందంగా వచ్చిన సందర్శకులు ఈ ప్రకటనతో నిరాశగా వెనుదిరిగారు.
రాష్ట్రవ్యాప్తంగా జనవరి 10 వరకు సామూహిక సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో జనవరి 10వ తేదీ వరకు నుమాయిష్-2022ను నిలిపివేయాలని సొసైటీ నిర్ణయించిందని, ఆ తర్వాతి పరిస్థితిని బట్టి నుమాయిష్‌ను కొనసాగించాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి అశ్విన్ మార్గం తెలిపారు.