Jagan: ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం జగన్.. ఈరోజు ఎవరెవరిని కలవనున్నారంటే..!
- నిన్న మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ
- వైసీపీ ఎంపీలతో కలిసి నిన్న మధ్యాహ్నం భోజనం
- ఈరోజు అమిత్ షాను కలిసే అవకాశం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న సీఎం సాయంత్రం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు గంటసేపు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి ఆయన తీసుకెళ్లారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విమానయాన మంత్రి సింధియాతో ఆయన సమావేశమయ్యారు.
మరోవైపు నిన్న మధ్యాహ్నం ఢిల్లీలోని జనపథ్ - 1 అధికార నివాసంలో పార్టీ ఎంపీలతో కలిసి ఆయన భోజనం చేశారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మార్గాని భరత్, బాలశౌరి, నందిగం సురేశ్, గోరంట్ల మాధవ్, ఎంవీవీ సత్యనారాయణ ఇందులో పాల్గొన్నారు.
ఈరోజు కూడా పలువురు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కానున్నారు. ఉదయం 9.30 గంటలకు కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉదయం 11 గంటలకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉంది. ఈ భేటీల అనంతరం ఆయన తాడేపల్లికి తిరిగిరానున్నారు.