PM Kisan: పీఎం కిసాన్ సొమ్ముపై మోసగాళ్ల కన్ను... రైతులను అప్రమత్తం చేసిన కేంద్రం
- రైతులకు ప్రయోజనకరంగా పీఎం కిసాన్
- ఇటీవల నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
- రైతుల ఖాతాల్లో డబ్బు పడిన వెంటనే రెచ్చిపోతున్న నేరగాళ్లు
- నకిలీ ఓటీపీలు, సందేశాలతో మోసగిస్తున్న వైనం
రైతులకు లబ్ది చేకూర్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింది ఇటీవలే కేంద్రం నిధులు విడుదల చేసింది. అయితే పీఎం కిసాన్ సొమ్ముపై కొందరు సైబర్ నేరగాళ్ల కన్ను పడిందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. రైతుల ఖాతాల్లో నగదు జమ కాగానే, వారి ఫోన్లకు మోసపూరిత ఓటీపీలు, నకిలీ సందేశాలు పంపుతూ ఆ డబ్బు కొట్టేస్తున్నారని కేంద్రం వెల్లడించింది.
ఆకట్టుకునే ఆఫర్లు ఉన్నాయనో.. లేక సరైన వివరాలు తెలుపకపోతే బ్యాంకు ఖాతా మూతపడే ప్రమాదం ఉందనో భయపెడుతూ సైబర్ నేరగాళ్లు రైతులను మోసగిస్తున్నారని వివరించింది. పెద్దగా బ్యాంకు విషయాలపై పరిజ్ఞానం లేని రైతులు అది నిజమేనని నమ్మి కీలకమైన వివరాలను సైబర్ నేరగాళ్లతో పంచుకుంటున్నారని, తద్వారా రైతుల ఖాతాల్లో డబ్బు మాయం అవుతోందని కేంద్రం పేర్కొంది.
అందుకే, ఓటీపీలకు, నకిలీ సందేశాలకు, నకిలీ ఈమెయిల్స్ కు స్పందించవద్దని హెచ్చరించింది. పలు రాష్ట్రాల్లో రైతులు ఈ విధంగా మోసపోయిన ఘటనలు జరిగాయని వెల్లడించింది.