Bulli Bai app: పోలీసుల కస్టడీలో బుల్లీ భాయ్ యాప్ ‘మాస్టర్ మైండ్’.. ఆమె 18 ఏళ్ల బాలిక!
- ఉత్తరాఖండ్ లోని ఉదంపూర్ లో అరెస్ట్
- ఇంటర్ చదివి ఇంజనీరింగ్ కు సన్నద్ధం
- నేపాల్ స్నేహితుడి సూచనతో నకిలీ ఖాతా
- దీని ఆధారంగానే బుల్లీభాయ్ లో అభ్యంతరకర ఫొటోలు
ముస్లిం మహిళలను వేలానికి పెట్టినట్టు ఆరోపణలున్న బుల్లీభాయ్ యాప్ వెనుక సూత్రధారి 18 ఏళ్ల బాలిక శ్వేతాసింగ్ అని ముంబై సైబర్ సెల్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మంగళవారం ఉత్తరాఖండ్ లోని ఉదంసింగ్ నగర్ జిల్లా రుద్రపూర్ లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆమె ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షల కోసం సన్నద్దమవుతోంది. జనవరి 5 వరకు స్థానిక కోర్టు ఆమెకు ట్రాన్సిట్ రిమాండ్ విధించింది. అనంతరం ఆమెను ముంబైకి తరలించారు.
100 మంది వరకు ముస్లిం మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసి.. బుల్లీభాయ్ యాప్ లోకి అప్ లోడ్ చేయడమే కాకుండా, వేలానికి పెట్టినట్టు ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై జనవరి 1న ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన శ్వేతాసింగ్ కు ఇద్దరు సోదరీమణులు, 8వ తరగతి చదివే ఒక సోదరుడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల విశాల్ కుమార్ ఝా ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్వేతాసింగ్ ను సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ కు చెందిన జియూ అనే సోషల్ మీడియా స్నేహితుడి సూచనల మేరకు ‘జట్ ఖల్సా07’ అనే నకిలీ ఖాతాను ఆమె తెరిచింది. ఈ ఖాతా ఆధారంగా బుల్లీభాయ్ యాప్ లో కంటెంట్ పోస్ట్ చేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు.
శ్వేతాసింగ్, ఝా నిత్యం సంప్రదించుకునే వారని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఇదే తరహా భావజాలం కలిగిన వారితో కలసి వారు ఈ నేరానికి పాల్పడినట్టు పేర్కొన్నారు. ద్వేషపూరిత వ్యాఖ్యలను ఆమె అదే పనిగా పోస్ట్ చేయడమే కాకుండా.. జట్ ఖల్సా07 పేరిట ట్విట్టర్ హ్యాండిల్ పేరిట సెలబ్రిటీల అభ్యంతరకర ఫొటోలను పోస్ట్ చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.