COVID19: కరోనా సునామీ.. ఏపీ మినహా ఆంక్షల వలయంలో దక్షిణ భారతం

Total South India Under Restrictions Except AP

  • కర్ణాటకలో వీకెండ్ కర్ఫ్యూ 2 వారాల పెంపు
  • నర్సరీ నుంచి 9వ తరగతి వరకు క్లాసుల బంద్
  • తమిళనాడులో సండే లాక్ డౌన్
  • కేరళలో జనసమూహాలపై నిషేధం
  • తెలంగాణలో అన్ని సభలు, సమావేశాలు బ్యాన్
  • ఎలాంటి ఆంక్షలు పెట్టని ఏపీ

దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే రెట్టింపయ్యాయి. ఈ క్రమంలోనే చాలా రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి. ఒక్క ఏపీ తప్ప దక్షిణ భారతం మొత్తం ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయింది. తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఆంక్షలను విధించాయి. వీకెండ్ లాక్ డౌన్ పెట్టడమో, నైట్ కర్ఫ్యూ విధించడమో, సభలు, సమావేశాలపై నిషేధం విధించడమో వంటి ఆంక్షలను పెడుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలను మూసేస్తున్నాయి.  

కర్ణాటక

కర్ణాటక ప్రభుత్వం వీకెండ్ కర్ఫ్యూను పొడిగించింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు ఇప్పటికే ఉన్న కర్ఫ్యూ ఆంక్షలను మరో రెండు వారాలు పెంచింది. నర్సరీ నుంచి 9వ తరగతి వరకు క్లాసులను బంద్ పెట్టింది. పబ్బులు, క్లబ్బులు, హోటళ్లు, ఆడిటోరియం, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, మాల్స్, రెస్టారెంట్లు, థియేటర్లకు 50 శాతం సామర్థ్యంతోనే అనుమతినిచ్చింది.

అలాగే, నిరసనలు, సభలు, జన సమూహాలపై నిషేధం విధించింది. కేరళ, మహారాష్ట్ర, గోవా సరిహద్దుల్లో నిఘాను కట్టుదిట్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో అయితే 200 మంది, బాంకెట్ హాల్స్ వంటి క్లోజ్డ్ ప్రదేశాల్లో అయితే 100కి మించకుండా వివాహ శుభకార్యాలు చేసుకోవాలని ఆంక్షలు పెట్టింది. కేసులు పెరుగుతుండడంతో బెంగళూరులో ఇప్పటికే కరోనా కేర్ సెంటర్లను పున:ప్రారంభిస్తున్నారు.

తమిళనాడు

తమిళనాడు ప్రభుత్వం ఆదివారం మొత్తం లాక్ డౌన్ ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మిగతా రోజుల్లో రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంది. షాపింగ్ మాళ్లు, వాణిజ్య సంస్థలు, షాపులు, రెస్టారెంట్లు 50 శాతం కెపాసిటితోనే నడుపుకొనేలా నిబంధనలను విధించింది. బస్సులు, మెట్రో రైళ్లకూ 50% కెపాసిటీతోనే ప్రయాణించేలా అనుమతులిచ్చింది. పొంగల్ పండుగ వేడుకలను వాయిదా వేసింది. శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో గుళ్లు, ప్రార్థనామందిరాలను మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనాపై ప్రభుత్వం టెలీ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది.

కేరళ

వాస్తవానికి సెకండ్ వేవ్ లో బాగా ఇబ్బంది పడిన రాష్ట్రం కేరళనే. మహారాష్ట్రలోనూ కేసులు ఎక్కువగా నమోదైనా.. సెకండ్ వేవ్ తగ్గేనాటికి కేరళలో మాత్రం కేసులు పైపైకే పెరిగిపోయాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ సంకేతాల నడుమ మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జన సమూహాలపై కేరళ ప్రభుత్వం నిషేధం విధించింది.  నైట్ కర్ఫ్యూను కొనసాగిస్తోంది. అవుట్ డోర్ ఫంక్షన్లకు 150, క్లోజ్డ్ డోర్ ఫంక్షన్లకు 75 మందికే అనుమతినిచ్చింది.

తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్న ఒక్కరోజే వెయ్యి కేసులు రాగా.. నిన్న 1500 కేసులు నమోదయ్యాయి. అంతకుముందుతో పోలిస్తే రెట్టింపు కేసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. సభలు, సమావేశాలు, సమూహాలపై జనవరి 10 వరకు నిషేధం విధించింది. అన్ని మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధించింది. ప్రస్తుతానికి వీకెండ్ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ లాంటి చర్యలేవీ తీసుకోలేదు. అయితే, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 8 నుంచే ప్రభుత్వం స్కూళ్లకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్

కరోనా కేసులు పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాలూ ఆంక్షలు పెడుతున్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి ఆంక్షలనూ విధించలేదు. నిన్న ఏపీలో 24 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆంక్షలు పెట్టకపోయినా టెస్టింగ్, ట్రేసింగ్ ను పెంచింది.

  • Loading...

More Telugu News