CM Jagan: ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తా: ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్
- 71 డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల పోరుబాట
- ఇప్పటికే సీఎస్, ఇతర అధికారులతో ఉద్యోగుల చర్చలు
- ఉద్యోగుల్లో తొలగని అసంతృప్తి
- నేడు సీఎం జగన్ తో భేటీ
ఏపీ సీఎం జగన్ తో ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. వారి డిమాండ్ల పట్ల సీఎం జగన్ సామరస్యపూర్వకంగా స్పందించారు. ఎంత మంచి చేయడానికి వీలవుతుందో అంత చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు వెలిబుచ్చిన సమస్యలన్నింటినీ నోట్ చేసుకున్నానని, వాటిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మూడ్రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని వెల్లడించారు.
అయితే ఉద్యోగులు వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలని సీఎం జగన్ హితవు పలికారు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉండరాదని పేర్కొన్నారు. ప్రతి సమస్యను పరిష్కరించేందుకే తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సహా 71 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి. ఇప్పటికే సీఎస్, ఇతర అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో ఉద్యోగ సంఘాలు నేరుగా సీఎంతోనే మాట్లాడతామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యాయి.