Kodali Nani: మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ పత్రికలు, చానెళ్లను నిషేధిస్తున్నాం: మంత్రి కొడాలి నాని
- పలు చానళ్లు, పత్రికలపై కొడాలి నాని ధ్వజం
- ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం
- ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపాటు
- పాత్రికేయ విలువలు అడుగంటిపోయాయని వ్యాఖ్యలు
కొన్ని తెలుగు మీడియా సంస్థలపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయా మీడియా సంస్థలను నిషేధిస్తున్నామని చెప్పారు. టీవీ 5, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీలను మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిషేధిస్తున్నామని తెలిపారు. ఈ మీడియా సంస్థలు ఎల్లప్పుడూ అసత్య కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
ముఖ్యంగా చంద్రబాబు, రామోజీరావు కలిసి ఇంగితజ్ఞానం లేకుండా విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పే దొంగమాటలను రామోజీరావు ప్రచురిస్తుంటారని విమర్శించారు. చంద్రబాబు కుల పత్రికలు, కుల టీవీ చానళ్లను అడ్డంపెట్టుకుని రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, జగన్ ను అధికార పీఠం నుంచి దించి చంద్రబాబు సీఎం అయితే కనుక ఇక తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి నాని సవాల్ విసిరారు.