Nalgonda District: నల్గొండ జిల్లా వసతి గృహంలో బాలికలపై అత్యాచారం కేసు.. దోషి, అతడికి సహకరించిన నిర్వాహకుడికి జీవిత ఖైదు
- నల్గొండ జిల్లాలో బాలికల వసతి గృహాన్ని నిర్వహిస్తున్న గుంటూరు జిల్లా దంపతులు
- ట్యూటర్‌గా చేరి బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన రమావత్ హరీశ్
- అతడికి సహకరించిన నిర్వాహకులు
- నిర్వాహకుడి భార్యకు ఆరు నెలల జైలుశిక్ష
వసతిగృహంలో 12 మంది బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడిని దోషిగా తేల్చిన నల్గొండ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. అలాగే, అతడికి సహకరించిన వసతిగృహ నిర్వాహకుడికి కూడా జీవిత ఖైదు విధించగా, అతడి భార్యకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ఏనమీదితండాలో గుంటూరు జిల్లా నాగారానికి చెందిన భార్యాభర్తలు నున్నం శ్రీనివాసరావు, సరిత కలిసి విలేజ్ రీ కన్‌స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (వీఆర్ఓ) అనే ప్రైవేటు సంస్థను స్థాపించి బాలికల వసతిగృహాన్ని నిర్వహిస్తున్నారు.
ఇందులోని బాలికలకు చదువు చెప్పేందుకు రమావత్ హరీశ్ నాయక్‌ను ట్యూటర్‌గా నియమించారు. ఈ క్రమంలో హరీశ్ మూడు నెలలపాటు 12 మంది బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెప్పినా, ఎదురు తిరిగినా చంపేస్తానని బెదిరించాడు. నిందితుడు హరీశ్‌కు నిర్వాహకులైన శ్రీనివాస్, అతడి భార్య సహకరించారు.
3 ఏప్రిల్ 2014న బాధిత బాలిక ఒకరు తనపై జరిగిన దారుణాన్ని వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించడంతో మరిన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మొత్తం 12 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. దీంతో మొత్తం 12 మంది బాలికల ఫిర్యాదు మేరకు 12 కేసులు నమోదు చేశారు.
దర్యాప్తు అనంతరం మొత్తం 12 చార్జ్‌షీట్లు దాఖలు చేయగా, కోర్టు విచారణలో 10 కేసుల్లో నేరం నిర్ధారణ అయింది. హరీశ్, శ్రీనివాసరావులను దోషులుగా తేల్చిన న్యాయస్థానం వారిద్దరికీ జీవిత ఖైదు, రూ. 10 వేల చొప్పున జరిమానా, సరితకు ఆరు నెలల జైలుశిక్ష విధించింది. అలాగే, బెదిరింపులకు పాల్పడినందుకు హరీశ్‌కు మరో రెండేళ్లు, అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్గొండ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నాగరాజు నిన్న తీర్పు చెప్పారు.