Telangana: 2001 నాటి కేసులో ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవకు పోలీసుల నోటీసులు
- ఇంటికి నోటీసులంటించిన పాల్వంచ పోలీసులు
- ఏఎస్పీ శబరీశ్ ముందుకు రావాలని ఆదేశాలు
- కుటుంబం ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న రాఘవ
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనపై ఉన్న పాత కేసులనూ ఇప్పుడు తోడుతున్నారు.
ఈ క్రమంలో 2001లో నమోదైన కేసుకు సంబంధించి తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఆయన ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం 12.30లోపు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. మణుగూరు ఏఎస్పీ శబరీశ్ ఎదుట హాజరు కావాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాఘవ పరారీలో ఉన్నారు.
2001లో మల్లిపెద్ది వెంకటేశ్వరరావు అనే ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య కేసులోనూ రాఘవ నిందితుడిగా ఉన్నారు. తన ఆత్మహత్యకు కారణమంటూ వెంకటేశ్వరరావు సూసైడ్ నోట్ లో రాఘవ పేరును రాశారు. పాల్వంచ గ్రామీణం, పట్టణ పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో రాఘవ ముందస్తు బెయిల్ పొందారు.
అయితే, నిన్న రాఘవ అరెస్ట్ పై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాఘవను కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే రాఘవ తమ అదుపులో లేడని పోలీసులు ప్రకటించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం వల్లే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి.