Revanth Reddy: రాజీవ్ ఎప్పుడూ భద్రతా సిబ్బందిని నిందించలేదు... మోదీ అందుకు భిన్నంగా వ్యవహరించారు: రేవంత్ రెడ్డి
- పంజాబ్ లో ప్రధాని మోదీకి నిరసనల సెగ
- ఫ్లైఓవర్ పై 20 నిమిషాల పాటు నిలిచిపోయిన మోదీ
- భద్రతా వైఫల్యమేనన్న కేంద్రం
- రాజీవ్ పై దాడుల వీడియోను షేర్ చేసిన రేవంత్
పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి రైతుల నిరసన సెగలు తాకిన సంగతి తెలిసిందే. రైతులు అడ్డుకోవడంతో ఆయన ఫిరోజ్ పూర్ జిల్లాలో ఓ ఫ్లైఓవర్ పై 20 నిమిషాల పాటు నిర్బంధంలో చిక్కుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది భద్రతా వైఫల్యం అంటూ కేంద్రం పేర్కొంటోంది. కాంగ్రెస్ పాలిత పంజాబ్ సర్కారే దీనికి బాధ్యత వహించాలని అంటోంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.
"రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. హత్యకు గురికాకముందు గతంలో ఆయనపై రెండుసార్లు దాడి జరిగింది. కానీ ఆయన ఎప్పుడూ భద్రతా సిబ్బందిని నిందించలేదు. కాంగ్రెస్ పార్టీకి దేశమే ప్రథమ ప్రాధాన్యత. కానీ ఇవాళ మన ప్రధాని మాత్రం భద్రతా వైఫల్యం అంటూ నిందిస్తున్నారు. అభద్రతా భావంతో ఉన్న ఆయన తనపై ఎలాంటి దాడి జరగకపోయినా ఆరోపణలు చేస్తున్నారు" అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. ఈ మేరకు గతంలో రాజీవ్ పై దాడులకు సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు.