COVID19: దేశంలో భారీగా పెరిగిన కరోనా 'ఆర్' విలువ.. ఫిబ్రవరిలో కేసులు పతాకస్థాయికి!
- గత రెండు వారాల కేసుల ఆధారంగా లెక్కగట్టిన ఐఐటీ మద్రాస్
- డిసెంబర్ 25 నుంచి 31 మధ్య 2.9గా నమోదు
- జనవరి 1 నుంచి 6 మధ్య 4కు పెరుగుదల
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్క వారంలోనే ఐదారింతలయ్యాయి. ఈ నేపథ్యంలోనే గత రెండు వారాల్లో నమోదైన ఆర్ నాట్ వాల్యూ (కరోనా కేసుల రిప్రొడక్షన్ వాల్యూ– ఓ వ్యక్తి నుంచి ఎంత మందికి వైరస్ సోకుతుందన్నది తెలిపే విలువ)పై ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు విశ్లేషణ చేశారు.
డిసెంబర్ 25 నుంచి 31 మధ్య 2.9గా ఉన్న ఈ ఆర్ నాట్ విలువ.. జనవరి 1 నుంచి 6 మధ్య 4కు పెరిగినట్టు తేల్చారు. సెకండ్ వేవ్ పతాక స్థాయిలో వున్న సమయంలో కూడా వీటి కన్నా తక్కువగానే ఆర్ నాట్ విలువ ఉంది. అప్పుడు కేవలం 1.69గా మాత్రమే ఆర్ విలువ ఉంది.
కరోనా ప్రస్తుత వేవ్ ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్య పతాకస్థాయికి చేరుకుంటుందని తేల్చారు. కాంటాక్ట్స్ క్వారంటైన్, ఆంక్షల విధింపుతో ఆర్ నాట్ విలువ తగ్గే అవకాశం ఉంటుందని ఐఐటీ మద్రాస్ గణిత విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన ఆర్ విలువ కన్నా తమ అంచనా ఎక్కువగా ఉండడంపైనా ఆయన వివరణ ఇచ్చారు. తాము వేర్వేరు ఇంటర్వెల్స్ లో ఆర్ నాట్ విలువను లెక్కించామని స్పష్టం చేశారు.