diabetes risk: కరోనాతో చిన్నారుల్లో మధుమేహ వ్యాధి రిస్క్!: సీడీసీ
- కరోనా తర్వాత చిన్నారుల్లో మధుమేహం కేసుల పెరుగుదల
- గతంతో పోలిస్తే 2.6 రెట్లు అధికం
- అమెరికా డేటా బేస్ ఆధారంగా సీడీసీ గుర్తింపు
చిన్నారులను కరోనా వైరస్ ఏమీ చేయడం లేదన్న అభిప్రాయం ఒకటి ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో చిన్నారులవి చాలా స్వల్పంగానే ఉంటున్నాయి. ఒమిక్రాన్ ముందు వరకు ఆస్పత్రులకు కరోనా చికిత్సకు వచ్చిన చిన్నారుల కేసులు కూడా పెద్దగా లేవు. సహజసిద్ధంగా వారికి ఉండే రోగనిరోధక వ్యవస్థ వారిని కాపాడుతుండొచ్చు. కానీ, కరోనా నుంచి కోలుకున్న చిన్నారుల్లో టైప్-1, టైప్-2 మధుమేహం సమస్య రిస్క్ ఎక్కువగా ఉంటోందని అమెరికాలోని వ్యాధి నియంత్రణ, నిరోధక విభాగం (సీడీసీ) అంటోంది. అమెరికా ప్రజారోగ్య వ్యవహారాలు చూసే విభాగం ఇది.
కరోనా నుంచి కోలుకున్న పెద్దవాళ్లలో మధుమేహం రావడం చూస్తూనే ఉన్నాం. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చిన్న పిల్లల్లో టైప్-1 డయాబెటిస్ కేసులు పెరిగిపోయాయని యూరోప్ పరిశోధకులు చెబుతున్నారు. దీంతో సీడీసీ మొదటిసారి ఈ అంశంపై అధ్యయనం నిర్వహించింది. అమెరికాలో దాదాపు పౌరులు అందరికీ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ల డేటా బేస్ ఆధారంగా సీడీసీ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది.
18 ఏళ్లలోపు పిల్లలు కరోనా బారిన పడిన తర్వాత ఎంత మందిలో మధుమేహాన్ని గుర్తించారన్న వివరాలు రాబట్టింది. అలాగే, విడిగానూ దేశవ్యాప్తంగా మధుమేహం బారిన పడిన 18 ఏళ్లలోపు వారి గణాంకాలను సమీకరించింది. చిన్నారుల్లో మధుమేహం కేసులు 2.6 రెట్లు పెరిగినట్టు తెలిసింది. కనుక పిల్లల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి.