Sony: ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ నుంచి అదిరిపోయే ఫీచర్లతో మరో ఎలక్ట్రిక్ కారు
- రెండేళ్ల కిందట తొలికారు తీసుకువచ్చిన సోనీ
- విజన్ శ్రేణిలో మరో కారు
- టెస్లా మోడల్ ఎక్స్ కు పోటీ ఇవ్వనున్న విజన్ ఎస్-02
- 2022 మధ్యలో మార్కెట్లోకి రానున్న కొత్త కారు
జపనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ కార్ల తయారీ రంగంలోనూ నిలదొక్కుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. తాజాగా సోనీ 'విజన్ ఎస్-02' పేరిట ఎలక్ట్రిక్ కారు రూపొందించింది. ఓ అంతర్జాతీయ ఆటో ఎక్స్ పోలో తన విద్యుత్ ఆధారిత కారును సోనీ సగర్వంగా ప్రదర్శించింది. సోనీ డిజైన్ చేసిన ప్రోటోటైప్ కార్లలో ఇది రెండోది. రెండేళ్ల కిందట సోనీ విజన్ ఎస్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. ఇప్పుడదే శ్రేణిలో మరింత అభివృద్ధి చేసిన మోడల్ ను తీసుకువచ్చింది.
ఈ కారులో 7 సీట్లు ఉంటాయి. ఎలక్ట్రిక్ కార్ల ఎస్ యూవీ సెగ్మెంట్ లో ఇది టెస్లా మోడల్ ఎక్స్ కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఇందులో సోనీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన సీఎంఓఎస్ సెన్సార్లను వినియోగించారు. ప్రయాణంలో నావిగేషన్ కు ఈ వ్యవస్థ ఎంతో సహకరిస్తుంది. 20 అంగుళాల అల్లాయ్ వీల్స్ పై ఈ కారు 4.9 మీటర్ల నిడివితో నిర్మించారు. సోనీ తనట్రేడ్ మార్క్ 3డీ సౌండ్ సిస్టమ్ ను విజన్ ఎస్-02 కారులో పొందుపరిచింది. కారులోని వ్యక్తులు అద్భుతమైన సరౌండ్ సౌండ్ అనుభూతిని పొందుతారు.
కారులో ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ను పరిశీలిస్తే ఇది 5జీ ఎనేబుల్డ్ అని చెప్పాలి. వీడియో గేములు ఆడుకునేందుకు సోనీ తన లేటెస్ట్ వెర్షన్ ప్లే స్టేషన్ ను ఏర్పాటు చేసింది. సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ దీంట్లో ప్రత్యేకత అని చెప్పాలి. కారు చుట్టూ ఉండే కెమెరాలు, సెన్సార్లు అత్యంత సురక్షితంగా ఉంచడంలో తోడ్పడతాయి. ఈ కాన్సెప్ట్ కారు తనంతట తానే పార్క్ చేసుకోగలదు.
ఇది డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సహితం. దీంట్లో 268 హెచ్ పీ శక్తినిచ్చే ఇంజన్ అమర్చారు. 180 కిమీ పైచిలుకు వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కారు ఏడాది మధ్యలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.