Artificial Heart: కృత్రిమ గుండెను తయారుచేస్తున్న ఐఐటీ కాన్పూర్
- టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఐఐటీ కాన్పూర్
- దేశ విదేశీ నిపుణులతో టాస్క్ ఫోర్స్
- కృత్రిమ గుండెకు 'ఎల్వీఏడీ'గా నామకరణం
కృత్రిమ అవయవాలను రూపొందించే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడంలో ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా భారత పరిశోధకులు గుండెను ప్రయోగశాలలో తయారుచేసేందుకు కృషి చేస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు కృత్రిమంగా గుండెను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఐఐటీ కాన్పూర్ ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి అవసరమైన ప్రక్రియ ప్రారంభించింది.
ఈ టాస్క్ ఫోర్స్ లో ఐఐటీ ప్రొఫెసర్లు, అమెరికా వైద్య నిపుణులు, ఎయిమ్స్, అపోలో, ఫోర్టిస్, మేదాంత వైద్య సంస్థలకు చెందిన అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారు. ఈ కృత్రిమ గుండెకు లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ (ఎల్వీఏడీ)గా నామకరణం చేశారు. వైద్య రంగంలో ఐఐటీ కాన్పూర్ చేసిన విశేష కృషిని చర్చించేందుకు తాజాగా ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే కృత్రిమ గుండె తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.