Actor Siddharth: సైనా నెహ్వాల్ పై అసభ్య వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్ ఖాతాను నిలిపివేయండి: ట్విట్టర్ ను కోరిన జాతీయ మహిళా కమిషన్

NCW wrote Twitter India to block actor Siddharth account
  • పంజాబ్ లో ప్రధాని మోదీ కాన్వాయ్ అడ్డగింత
  • ఈ ఘటనను ఖండించిన సైనా నెహ్వాల్
  • సైనా వ్యాఖ్యలకు సిద్ధార్థ్ స్పందన
  • సిద్ధార్థ్ వ్యాఖ్యలపై దుమారం!
దక్షిణాది నటుడు సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఇటీవల వెల్లడించిన అభిప్రాయాలు వివాదాస్పదం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ను పంజాబ్ లో అడ్డగించడాన్ని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఖండించింది. ప్రధాని మోదీపై దాడికి యత్నించడం పిరికింద చర్య అని పేర్కొంది. ప్రధానిపైనే దాడి యత్నం జరిగితే ఏ దేశమైనా భద్రంగా ఉన్నట్టు ఎలా భావించగలం అని ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ పై నటుడు సిద్ధార్థ్ స్పందించాడు. "ఓ చిన్న కాక్ తో ఆడే ఆటలో ప్రపంచ చాంపియన్... దేవుడి దయ వల్ల మనకు దేశాన్ని కాపాడేవాళ్లున్నారు" అంటూ వ్యంగ్యం ప్రదర్శించాడు. అయితే సిద్ధార్థ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.

ఓ స్త్రీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా, స్త్రీద్వేషంతో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉందని పేర్కొంది. నటుడు సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, సుమోటోగా ఈ వ్యవహారాన్ని విచారణకు స్వీకరిస్తున్నామని కమిషన్ వెల్లడించింది. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఈ వ్యవహారంపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేయాలని ఆదేశించారని ఓ ప్రకటనలో తెలిపింది.

సోషల్ మీడియా వేదికగా ఓ మహిళపై అసభ్యకరమైన భాషను ఉపయోగించడం పట్ల ఆ నటుడ్ని కఠినంగా శిక్షించాలని కోరింది. చైర్మన్ రేఖా శర్మ ట్విట్టర్ ఇండియా గ్రీవెన్స్ అధికారికి కూడా లేఖ రాసినట్టు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. సైనా నెహ్వాల్ పై సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ను నిలిపివేయాలని కోరినట్టు వివరించింది. అంతేకాదు, ఆ నటుడి ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని కూడా కోరినట్టు తెలిపింది.

కాగా తన వ్యాఖ్యలను వేరే అర్థంలో తీసుకుని తప్పుగా భావిస్తున్నారని సిద్ధార్థ్ మరో ట్వీట్ లో వివరణ ఇచ్చాడు. 'కాక్ అండ్ బుల్' అని కూడా పేర్కొంటుంటామని, అయితే దాన్ని మరో విధంగా అన్వయించడం అనైతికం అని తెలిపాడు. ఎవరినీ అవమానపర్చాలని ఈ వ్యాఖ్యలు చేయలేదని సిద్ధార్థ్ స్పష్టం చేశాడు.
Actor Siddharth
Saina Nehwal
NCW
Twitter
Narendra Modi
Punjab

More Telugu News