Chris Morris: అన్ని ఫార్మాట్లలోనూ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సఫారీ ఆల్ రౌండర్

South Africa all rounder Chris Morris announced his retirement

  • క్రికెట్ కు వీడ్కోలు పలికిన క్రిస్ మోరిస్
  • 12 ఏళ్ల కెరీర్ కు ముగింపు
  • 2019లో చివరిసారి దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం 
  • ఐపీఎల్ లో రికార్డుస్థాయి ధర

ఐపీఎల్ లో రూ.16.25 కోట్ల రికార్డుస్థాయి ధరతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన క్రిస్ మోరిస్ ఆటకు వీడ్కోలు పలికాడు. ఈ దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ తన 12 ఏళ్ల కెరీర్ కు నేటితో ముగింపు పలికాడు. క్రిస్ మోరిస్ వయసు 34 ఏళ్లే. అయితే, ఆటతో అనుబంధం కొనసాగిస్తానని, దక్షిణాఫ్రికా దేశవాళీ జట్టు టైటాన్స్ కు కోచ్ గా బాధ్యతలు అందుకుంటానని మోరిస్ వెల్లడించాడు.

తన కెరీర్ ఆసాంతం ఎంతో సరదాగా గడిచిందని, తన ప్రస్థానంలో ఎక్కువగానో, తక్కువగానో ఏదో ఒక రూపంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్ లీగ్ ల్లో విస్తృతంగా ఆడే క్రిస్ మోరిస్ దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు చివరిసారిగా 2019 వరల్డ్ కప్ లో ప్రాతినిధ్యం వహించాడు. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు సాధించింది అతడే. సాధారణంగా పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్లు మహా అయితే 135 కిమీ వేగంతో బౌలింగ్ చేస్తుంటారు. అయితే పొడగరి అయిన మోరిస్ అందుకు భిన్నంగా తరచుగా 140 కిమీ పైచిలుకు వేగంతో బంతులు సంధిస్తుంటాడు. అంతేకాదు, శక్తిమంతమైన హిట్టర్ కూడా. అతడి భారీ షాట్లు ఐపీఎల్ ప్రేక్షకులకు బాగా తెలుసు.

2021 సీజన్ కోసం క్రిస్ మోరిస్ ను రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ.16.25 వెచ్చించి కొనుక్కుంది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అంత ధర పలికిన ఆటగాడు మరొకరులేరు. అయితే చెల్లింపులపరంగా చూస్తే విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో మోరిస్ నిలుస్తాడు. 2018 నుంచి 2021 వరకు రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు కెప్టెన్ గా కోహ్లీ రూ.17 కోట్లు అందుకున్నాడు.

ఇక మోరిస్ టెస్టు కెరీర్ విషయానికొస్తే... కేవలం 4 మ్యాచ్ లు ఆడి 12 వికెట్లు తీశాడు. టెస్టుల్లో అత్యధిక స్కోరు 69 పరుగులు. వన్డేల్లో మోరిస్ 42 మ్యాచ్ లు ఆడి 48 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్లో మాత్రం మోరిస్ ఒక విధ్వంసక ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 234 టీ20 మ్యాచ్ లు ఆడి 290 వికెట్లు సాధించాడు. అంతేకాదు, బ్యాటింగ్ లో అతడి స్ట్రయిక్  రేటు 150 పైనే ఉంది.

  • Loading...

More Telugu News