high cholesterol: పాదాలు, చేతులు, దవడ నొప్పి.. ‘సైలెంట్ కిల్లర్’ కొలెస్ట్రాల్ సంకేతాలు కావచ్చు..!
- కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు
- ఎక్కువ మందిలో ఇది పైకి తెలియదు
- కొందరిలో నొప్పి రూపంలో కనిపిస్తుంది
- ఏటా పరీక్ష ద్వారా నిర్ధారించుకోవడమే మార్గం
కొలెస్ట్రాల్.. ఇది పైకి కనిపించదు. రక్తంలో ఒక పరిమితి దాటితే ప్రాణాంతకంగా మారుతుంది. కొవ్వు పదార్థాలనే లిపిడ్లు అని పిలుస్తారు. ఫ్యాట్ లు, వాక్స్ లు, నూనెలు, హార్మోన్లు ఇవన్నీ కూడా లిపిడ్స్ కిందకే వస్తాయి. శరీర కణజాలంలో లిపిడ్స్ కూడా భాగమే. పసుపుపచ్చ రంగుతో ఉండే ఇది రక్తంలో అధికమైతే అధిక కొలెస్ట్రాల్ గా పరిగణిస్తారు. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తో వీటి స్థాయులు ఎలా ఉన్నదీ తెలుస్తుంది.
ఎక్కువ అయితే సమస్యలే..
కొలెస్ట్రాల్ అవసరమే. శరీర కణ జీవక్రియల్లో దీని అవసరం ఉంటుంది. కాకపోతే ఇది నియంత్రణలోనే ఉండాలి. లేదంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువైతే రక్తాన్ని చిక్కగా చేస్తుంది. దీంతో రక్త ప్రసరణ సజావుగా సాగదు. ఈ కొలెస్ట్రాల్ ఆర్టరీల (ధమనులు) గోడల్లో పేరుకుపోతుంది. దీంతో రక్త ప్రసరణ మార్గం కుచించుకుపోతుంది. అప్పుడు బ్లాక్ లు ఏర్పడి గుండెపోటు రావచ్చు. మెదడుకు రక్త సరఫరాలో క్లాట్స్ ఏర్పడడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) ముప్పు తలెత్తుతుంది.
కొన్ని సంకేతాలు..
అందరిలోనూ అని కాదు కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువైతే కొందరిలో కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. రక్త నాళాల్లోపల కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి నొప్పికి దారితీస్తుంది. ఈ పరిస్థితినే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (పీఏడీ) అంటారు. అటువంటప్పుడు చేతులు, కాళ్లు, పాదాల్లో నొప్పి కనిపిస్తుంది. దాంతో నడవడం కష్టం కావచ్చు. అథెరో స్కెల్రోసిస్ లోనూ కొవ్వు పదార్థాలు ఆర్టరీల్లో పేరుకుపోయి రక్త సరఫరాను అడ్డుకుంటాయి. అప్పుడు కూడా చేతుల్లో నొప్పి కనిపించొచ్చు.
దవడ నొప్పి కనిపిస్తే పంటికి సంబంధించిందని వదిలేయడం మంచిది కాదు. గుండెకు సంబంధించి రిస్క్ కు సంకేతంగా చూడాలి. గుండెకు రక్త సరఫరా సజావుగా సాగని సందర్భాల్లో అది దవడ నొప్పిగానూ కనిపిస్తుంది. ఇందుకు కూడా కొలెస్ట్రాల్ కారణం అవుతుంది. 30 సంవత్సరాలు దాటిన వారు రెండేళ్లకోసారి, 40 ఏళ్లు దాటిన వారు ఏడాదికోసారి, 50 ఏళ్లు దాటిన వారు ఆరు నెలలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి.