Andhra Pradesh: ప్రజలను భయపెట్టేందుకే టీడీపీ నేతల హత్య.. చంద్రయ్య హత్యపై చంద్రబాబు స్పందన
- వైసీపీ అరాచక పాలనలో చాలా మందిని హత్య చేశారు
- ఒక్క పల్నాడులోనే పది మందిని చంపేశారు
- జగన్ పాలనపై తిరగబడుతున్నారనే ఈ హత్యలన్న పార్టీ అధినేత
టీడీపీ నేత చంద్రయ్య హత్యపై పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడులో ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడైన తోట చంద్రయ్యను కొందరు వ్యక్తులు దారుణంగా నడిరోడ్డుపై గొంతు కోసి హ్యత చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలనలో ఇప్పటికే చాలా మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పల్నాడులోనే పదుల సంఖ్యలో హత్యలు జరిగాయన్నారు.
జగన్ పాలనపై తిరగబడుతుండడం వల్లే ప్రజలను భయపెట్టేందుకు వైసీపీ నేతలు ఈ హత్యలకు దిగుతున్నారని ఆరోపించారు. దాడులు చేసేవారికే పదవులను ఇచ్చే విష సంస్కృతికి జగన్ బీజం వేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై వైసీపీ వర్గీయులు హత్యాయత్నం చేశారని, పోలీసులు అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే వైసీపీ బరితెగింపులు ఆగేవని అన్నారు. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.