India: పలు నిత్యావసర సరుకుల ధరలను పెంచేసిన కంపెనీలు
- ముడి పదార్థాల ధరలు పెరగడంతో నిర్ణయం
- వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్ బోయ్ ధరల పెంపు
- 3 నుంచి 20 శాతం వరకు పెరిగిన వైనం
- అదానీ విల్మార్ ప్యాకేజ్డ్ గోధుమ పిండి ధరలు 5-8 శాతం పెంపు
ముడి పదార్థాల ధరలు పెరగడంతో దేశంలోని ప్రముఖ కంపెనీలు పలు నిత్యావసర సరుకుల ధరలను పెంచేశాయి. హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యుఎల్) తమ సబ్బులు, డిటర్జెంట్లయిన వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్ బోయ్ ధరలను 3 నుంచి 20 శాతం వరకు పెంచింది. ఈ సంస్థ గత ఏడాది నవంబర్ లో కూడా వాటి ధరలను పెంచడం గమనార్హం. ఈ సారి సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర 20 శాతం పెంచింది.
దీంతో సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర రూ.10 నుంచి రూ.12కు పెరిగింది. అలాగే, లైఫ్ బోయ్ 125 గ్రాముల ప్యాక్ ధర రూ.29 నుంచి రూ.31కు, పియర్స్ 125 గ్రాముల సబ్బు ధర రూ.76 నుంచి రూ.83కు ఎగబాకింది. సింగిల్ రిన్ 250 గ్రాముల బార్ ధర రూ.18 నుంచి రూ.19కు పెరిగింది. వీల్ డిటర్జెంట్ పౌడర్ అర కిలో ప్యాక్ ధర రూ.30 నుంచి రూ.31కి పెంచింది. హిందుస్థాన్ యూనిలీవర్ తో పాటు పలు కంపెనీలు పలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచాయి.
ప్యాకేజ్డ్ గోధుమ పిండి ధరలను 5-8 శాతం పెంచుతున్నట్లు అదానీ విల్మార్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే, బాస్మతి బియ్యం ధరలను 8-10 శాతం పెంచింది. మరోవైపు, పార్లే ప్రొడక్ట్స్ ఈ ఏడాది మార్చి నెలలో 4-5 శాతం ధరలను పెంచాలని యోచిస్తోంది. గత త్రైమాసికంలోనూ ఆ కంపెనీ ధరలు పెరిగాయి. డాబర్ ఇండియా కంపెనీ ధరలు కూడా పెరగనున్నాయి. కావింకేర్ ఈ నెలలో తన షాంపూలు, చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలు 2-3 శాతం వరకు పెంచనుంది.