Elon Musk: భారత్ లోకి మా కార్లు రాకపోవడానికి కారణం ఇదే: టెస్లా అధినేత ఎలాన్ మస్క్
- భారత్ లో టెస్లా కారు లాంచింగ్ పై అప్ డేట్ ఉందా? అని ప్రశ్నించిన ట్విట్టర్ యూజర్
- మోదీ ప్రభుత్వంతో చాలా సమస్యలు ఉన్నాయన్న మస్క్
- వాటిని పరిష్కరించుకునేందుకు పని చేస్తున్నామని సమాధానం
2019లోనే భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ భావించారు. అయితే ఆయన అనుకున్నది ఒకటైతే... జరుగుతున్నది మరొకటి. ఇప్పటికీ ఆయన కార్యాచరణ వాస్తవ రూపం దాల్చలేదు. భారత ప్రభుత్వంతో చాలా సమస్యలు ఉన్నాయని... ఇప్పటికీ వాటిని పరిష్కరించుకునేందుకు పని చేస్తున్నామని మస్క్ తెలిపారు. భారత్ లో టెస్లా కార్ లాంచింగ్ విషయంలో ఏమైనా అప్ డేట్ ఉందా? అనే ప్రశ్నకు బదులుగా ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.
మోదీ ప్రభుత్వంలోని అధికారులతో గత నాలుగేళ్లుగా ఎలాన్ మస్క్ చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే స్థానికంగా ఫ్యాక్టరీని నెలకొల్పాలనే కండిషన్ తో పాటు దిగుమతులపై వంద శాతం సుంకం విధించడంతో మస్క్ కల ఇంత వరకు నెరవేరలేదు. కార్ల ఉత్పాదన ప్లాన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వాలని కూడా కేంద్రం కండిషన్ పెట్టింది.
గత అక్టోబర్ లో ఒక కేంద్ర మంత్రి మాట్లాడుతూ, చైనాలో తయారైన కార్లను ఇండియాలో అమ్మడానికి తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఇండియాలో స్థానికంగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి... ఇక్కడే కార్లను తయారు చేసి, విక్రయించాలని అన్నారు. ఇక్కడ తయారైన కార్లను ఎగుమతి చేసుకోవచ్చని చెప్పారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇండియాలో తమ కార్లను అమ్మాలనే మస్క్ కోరిక ఇంతవరకు తీరని కోరికగానే మిగిలిపోయింది.