childrens: పిల్లలు మొరుగుతున్నట్టు బిగ్గరగా దగ్గితే కరోనా లక్షణమేనంటున్న వైద్యులు!
- కొందరు చిన్నారుల్లోనే పలు లక్షణాలు
- కొందరిలో మల్టీ సిస్టమ్ ఇన్ ఫ్లమేటరీ
- కడుపునొప్పి, విరేచనాలు
- వైద్యులను సంప్రదించడమే మంచిదంటున్న నిపుణులు
కరోనా మొదటి రెండు విడతల్లో చిన్నారులపై ప్రభావం చూపించలేదు. ప్రస్తుత ఒమిక్రాన్ వేరియంట్ లో ఆసుపత్రుల్లో చేరే పిల్లల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కేసులు తక్కువగానే ఉంటున్నప్పటికీ పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండడానికి లేదన్నది నిపుణుల సూచన.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు చూస్తే పెద్దల్లో మాదిరే పిల్లల్లోనూ కరోనా వైరస్ తీరు ఉంటోంది. చాలా మందిలో లక్షణాలు లేకపోగా, కొద్ది మందిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. పిల్లలకు టీకాలు ఇవ్వలేదు కనుక వారిని కనిపెట్టుకొని ఉండడం అవసరం.
జ్వరం, బలహీనత, దగ్గు, జలుబు, గొంతులో మంట, నొప్పి లక్షణాలు ఉంటే కరోనాగా అనుమానించాలి. మల్టీ సిస్టమ్ ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్ పిల్లల్లో కనిపిస్తోంది. దీంతో శరీరంలోని ముఖ్యమైన అవయవాలు గుండె, ఊపరితిత్తులు, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ, మెదడు, రక్తనాళాల్లో వాపు ఏర్పడుతోంది.
ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు బిగ్గరగా, మొరుగుతున్నట్టు దగ్గుతుంటే కరోనాగా అనుమానించాలి. శ్వాస వ్యవస్థ ఎగువ భాగంలో (గొంతు, ముక్కు, నోరు) ఇన్ఫెక్షన్ కారణంగా ఈ తరహా దగ్గు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటప్పుడు జ్వరం కూడా కనిపిస్తుంది.
కడుపునొప్పి, విరేచనాలు కూడా కరోనా లక్షణాలుగానే భావించాలని గాంధీ వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వస్తున్న చిన్నారుల్లో కరోనా పాజిటివ్ గా తేలుతోంది. అందుకే పిల్లలకు జలుబు, జ్వరం, దగ్గు, బలహీనత, కడుపులో నొప్పి తరహా లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.