Telangana: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు
- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం
- రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న కూడా వానలు
- ఉష్ణోగ్రత తగ్గి పెరుగుతున్న చలి
గత వారం రోజులుగా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కూడా పలు జిల్లాలో మోస్తరు వర్షాలు పడ్డాయి. కాగా, మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక నిన్న వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగలవారి పేటలో అత్యధికంగా 87.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మహబూబాబాద్ జిల్లాలోని ఉప్పరగూడెంలో 68.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, ములుగు, హైదరాబాద్, మేడ్చల్ మాల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ చెదురుమదురు వానలు కురిశాయి.
మరోవైపు నిన్న పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠంగా 14.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15.2, నిర్మల్లో 15.7, నిజామాబాద్లో 16.2, నారాయణపేటలో 16.8, వికారాబాద్లో 17.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.