bhogi: అర్ధాంగితో కలిసి భోగి మంటలు వేసిన ఉపరాష్ట్రపతి.. ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంల సంక్రాంతి శుభాకాంక్షలు
- భోగి మంచి సందేశాన్నిచ్చే పండుగ: వెంకయ్య నాయుడు
- మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలి: మోదీ
- అరిష్టాలు తొలగిపోవాలి: కేసీఆర్
- ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలి: జగన్
భోగి పండుగ సందర్భంగా ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రతికూల ఆలోచనలు వదిలి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలనే సందేశాన్నిచ్చే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లోకి నూతన కాంతులను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. భోగి పండుగ శుభాకాంక్షలు' అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భోగి పండుగ సందర్భంగా చెన్నై కోట్టూర్ పురంలోని స్వగృహం వద్ద తన అర్ధాంగి ఉషమ్మతో కలిసి వెంకయ్య నాయుడు భోగి మంటలు వేశారు.
ఇక ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెబుతూ, 'అందరికీ భోగి శుభాకాంక్షలు.. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని పెంపొందింపజేయుగాక. అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అంటూ తెలుగులో ట్వీట్ చేశారు.
'జనులందరి జీవితాల్లోని అరిష్టాలు తొలగిపోయి, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
'మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు' అని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు.
'ప్రజల కష్టాలు భోగిమంటల్లో కాలిబూడిదవ్వాలని... రైతుకు శుభం జరగాలని... తెలుగునాట ప్రతి లోగిలి కొత్త వెలుగులు నింపుకుని భోగభాగ్యాలతో కళకళలాడాలని కోరుకుంటూ... తెలుగు వారందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.