Virat Kohli: మైదానంలో కోహ్లీ అసహనం.. వీడియో వైరల్.. స్పందించిన బౌలర్ ఎంగిడి!
- 21వ ఓవర్ లో అశ్విన్ బౌలింగ్
- నాలుగో బంతిని ఆడిన డీన్ ఎల్గర్
- బంతి ప్యాడ్లను తాకుతూ ఆఫ్‌స్టంప్ దిశగా వెళ్లగా ఔట్ ఇచ్చిన అంపైర్
- చివరకు నాటౌట్‌గా తేల్చిన ఫీల్డ్ అంపైర్
- స్టంప్స్ వద్దకు వెళ్లి పలు వ్యాఖ్యలు చేసిన కోహ్లీ
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, చివరి టెస్టు మ్యాచు ఆటలో నిన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
21వ ఓవర్ లో అశ్విన్ బౌలింగ్ చేయగా నాలుగో బంతిని డీన్ ఎల్గర్ ఆడాడు. బంతి ప్యాడ్లను తాకుతూ ఆఫ్‌స్టంప్ దిశగా వెళ్లి కీపర్ పంత్ చేతుల్లో అది పడింది. దీంతో అశ్విన్ అప్పీల్‌కు వెళ్లగా ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ ఔట్ ఇచ్చారు. అయితే, ఎల్గర్ రివ్యూకు వెళ్లాడు. చివరకు బాల్ ట్రాకింగ్ ను ప్రసారకర్తలు తప్పుగా చూపించడంతో ఫీల్డ్ అంపైర్ ఎల్గర్‌ను నాటౌట్‌గా ప్రకటించారు.
దీంతో టీమిండియా కెప్టెన్ కోహ్లీ మైదానంలో అసహనం వ్యక్తం చేశాడు. స్టంప్స్ వద్దకు వెళ్లిన కోహ్లీ ఎప్పుడూ తమ మీదే దృష్టి పెడితే ఎలా అని, మీ జట్టును కూడా కాస్త చూసుకోండంటూ వ్యాఖ్యలు చేశాడు.
స్టంప్స్ మైక్ ద్వారా ఆయన చేసిన వ్యాఖ్యల తీరుపై దక్షిణాఫ్రికా బౌలర్ ఎంగిడి స్పందించాడు. ఎల్గర్, పీటర్సన్ మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశారని చెప్పాడు. వారిని విడదీయాలని భారత జట్టు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, అది కష్టతరంగా మారిందని అన్నాడు.
అందుకే టీమిండియా అసహనానికి గురయిందని వ్యాఖ్యానించాడు. ఒక్కొక్కరి భావోద్వేగాలు ఒక్కోలా ఉంటాయని, అసహనం, విసుగు వంటి ఉద్వేగాలను ప్రదర్శించడం సాధారణమేనని చెప్పాడు. ఎవరూ ఉద్దేశపూర్వంగా అలాంటి తీరు ప్రదర్శించబోరని అన్నాడు. నిన్న టీమిండియా ఒత్తిడిలో ఉందని, మైదానంలో వారు వ్యవహరించిన తీరే ఈ విషయాన్ని తెలుపుతోందని అన్నాడు.